Sunday, January 12, 2025

లిక్కర్ స్కాంలో మరో మలుపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. అరుణ్ రామచంద్రన్ పిళ్లై సౌత్ లాబీలో తెలం గాణ ఎంఎల్‌సి తరపున వ్యాపారం చేస్తున్నానంటూ ఆమె ప్రతినిధినని ఇడికి ఇచ్చిన వాంగ్మూలాన్ని తాను వెనక్కి తీసుకుంటానని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు ఇడికి నోటీసులు జారీ చేసింది. రామ చంద్ర పిళ్లై ఇచ్చిన ట్విస్ట్‌తో ఇప్పుడు ఇడి ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపార వేత్త అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై తాను కెసిఆర్ కుమార్తె, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితకు బినామీనని ఇంతకు ముందు ఇడి అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలం ఆధారంగా రిమాండ్ రిపోర్టును ఇడి అధికారులు కోర్టుకు సమర్పించారు. సిబిఐ స్పెషల్ కోర్టుకు నివేదించిన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల మేర ముడుపులు ఇచ్చిన సౌత్ గ్రూప్ గుప్పిట్లో ఉన్న ఇండో స్పిరిట్స్ సంస్థలో ఎంఎల్‌సి కవిత తరఫున అరుణ్ పార్టనర్‌గా ఉన్నారని ఆరోపించింది.

ఈ కుంభకోణం మొత్తంలో అక్రమంగా సంపాదించిన సొత్తు దాదాపు రూ.296 కోట్లు ఉండవచ్చని అంచనా వేసింది. దీంట్లో కొంత సొమ్ముతో అరుణ్ రామచంద్ర పిళ్లై కొన్ని ఆస్తులు కొన్నారని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై కీలక వ్యక్తిగా పేర్కొన్నారు. సౌత్ గ్రూప్‌లో పార్టనర్స్‌గా శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్, శ్రీనివాసులు రెడ్డి, ఎంఎల్‌సి కవిత సహా మరికొంత మంది ఉన్నారు. దీనికి బయట ప్రతినిధులుగా పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చి బాబు వ్యవహరిస్తున్నారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. అరుణ్ రామచంద్ర పిళ్లైను సిబిఐ, ఇడి అధికారులు చాలా కాలంగా విచారిస్తున్నారు. దాదాపుగా 29 రోజుల పాటు ఆయనను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలోనే పిళ్లై వాంగ్మూలం ఇచ్చి నట్లుగా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవాలనుకోవడానికి కారణం ఏమిటన్నది ఆశ్చర్యకరంగామారింది. ఒక వేళ ఆ వాంగ్మూలం నిజం కాకపోతే ఏ ఉద్దేశంతో కవిత పేరును తెరపైకి తెచ్చారన్నది తేలాల్సి ఉంటుంది.

ఆయన తాను కవిత తరపునే వ్యాపా రం చేస్తున్నానని చెప్పు కోవడానికి దారి తీసిన పరిస్థితులేమిటో వెల్లడి కావాల్సి ఉంటుంది. ఈ అంశం ఇప్పటికే రాజకీయ దుమారం రేపుతోంది. తమను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని కవిత, కెటిఆర్ కూడా ఆరోపించారు. వాంగ్మూలం వెనక్కి తీసుకుంటానన్న రామచంద్ర పిళ్లై పిటి షన్‌పై ఇప్పుడు ఇడి ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. పిళ్లై వాంగ్మూలం ఆధారంగానే ఎంఎల్‌సి కవితకు ఇడి నోటీసులు జారీ చేసింది. 9వ తేదీనే ఆమె హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ప్రత్యేకంగా గడువు కోరి 11వ తేదీకి మార్చుకున్నారు. ఈ లోపే వాంగ్మూలం ఉపసంహరణ పిటిషన్ పిళ్లై దాఖలు చేయడంతో కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నట్లుగా భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News