బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు : 8 మంది దుర్మరణం
ప్రమాదం ఘటనపై సిఎం దిగ్భ్రాంతి –
హోంమంత్రి అనిత, కలెక్టర్, ఎస్‌పితో ఫోన్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు –
మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం ప్రకటించిన హోం మంత్రి అనిత
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలోని అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించడంతో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం మృతులు, గాయ పడిన వారు ఎక్కువ మంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన వారుగా చెబుతున్నారు. తారాజు వ్వలు తయారీలో పేరొందిన బాణాసంచా కర్మాగారం కావడం, పెళ్లిళ్లలో సీజన్ కావడంతో బాణాసంచా తయారు చేస్తున్నప్పుడు మంటలు చెలరేగడంతో పేలుడు జరిగింది.
పేలుడు ధాటికి భారీగా శబ్దం వచ్చింది. ఈ పేలుడు ధాటికి నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. పేలుడు కారణం గా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందు కున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సత్వర సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో కైలాసపట్నం గ్రామానికి చెందిన ఎ. తాతబాబు (45), యాది గోవింద్ (45), రాజపేటకు చెందిన దాడి రామలక్ష్మి(38), సామర్లకోటకు చెందిన నిర్మల (38), పురం పాప(40), వేణుబాబు (40), చౌడువాడకు చెంది న సేనాపతి బాబురావు, విశాఖకు చెందిన మనోహర్(30) ఉన్నారు. వీరం తా బాణాసంచా తయారీ కేంద్రంలో కూలి పనికి వచ్చినట్లు తెలుస్తోం ది. పేలుడు సమయంలో పరిశ్రమలో 15 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ పరిశీలించారు.
ఘటనపై కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు. క్షతగా త్రుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం కెజిహెచ్‌కు తరలించాలని ఆదేశించారు. ఘటనా సమయంలో బాణాసంచా కేంద్రంలో 15 మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు అధికారులు గుర్తిం చారు. ఈ ఘటనతో మొత్తం గ్రామంలో విషాదం నెలకొంది. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ పలువురు నాయకులు స్పందిం చారు. ప్రభు త్వం బాధిత కుటుంబాలకు తగిన న్యాయం చేసి, ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయి తే ఈ పేలుడుకు ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదం చోటుచేసుకన్న బాణసంచా తయారీ కేంద్రానికి అనుమ తులు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
బాణసంచా పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, కలెక్టర్, ఎస్‌పిలతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదంపై ఆరా తీశారు. బాధితుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల పరిస్థితిని సిఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. అగ్నిప్రమాద ఘటనపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని నర్సీపట్నం ఆర్డీవోకు స్పీకర్ ఆదేశించారు. నర్సీ పట్నం ఏరియా ఆస్పత్రి సిబ్బందిని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అప్రమత్తం చేశారు. బెడ్లు, వెంటిలేటర్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
పవన్ తీవ్ర విచారం
కోటపురట్ల ప్రమాదంపై డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితతో ఫోన్‌లో మాట్లాడి ఈ ఘటనపై ఆరా తీశారు. పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి లోకేశ్
బాణసంచా పరిశ్రమలో అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించడం దురదృష్టకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలన్న ఆయన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాడ సానుభూతి ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం : హోం మంత్రి అనిత
బాణసంచా పరిశ్రమలో అగ్నిప్రమాదంపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టాలని అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే హోంమంత్రి అనిత బాణసంచా పరిశ్రమ వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అగ్నిప్రమాదంలో మరణించిన ఒక్కొక్కరికీ రూ.15లక్షలు చొప్పున ఆయా కుటుంబాలకు పరిహారంగా అందించనున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు.
వైయస్.జగన్ సంతాపం
అనకాపల్లి జిల్లా కోటవురట్లలో ఒక బాణా సంచా తయారీ కేంద్రంలో ప్రమాద ఘటన పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్.జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడ్డం తీవ్ర విచారకరమన్నారు. మరణించినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు తోడుగా నిలవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలు తిరిగి కోలుకునేలా అన్నిరకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈ ప్రమాదం పార్టీ నాయకుల ద్వారా తెలియగానే వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి, సహాయంగా నిలవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వైయస్. జగన్ ఆదేశించారు.