పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ దేశ వ్యాప్తంగా భిన్న వర్గాల నుండి మోడీ పదేళ్ల పాలనపై విశ్లేషణ ఎక్కువైతున్నది. ఆయన పాలన కొనసాగాలని కోరేవాళ్లకన్నా మరో ఐదేళ్లు ఆయనే ప్రధానిగా ఉంటే దేశంలో సామాజిక న్యాయం, రాజ్యాంగ భద్రత ఇంకెంత దెబ్బ తింటాయో, నచ్చనివారిపై వ్యవస్థల దుర్వినియోగం ఎలా విరుచుకుపడుతుందో అనే బెంగ వాటిలో ప్రస్ఫుటమవుతోంది. నిజానికి ప్రస్తుతం బిజెపి ఏలుబడి గురించి ఉన్నదున్నట్లుగా రాసే పత్రికలు తక్కువే. మోడీకి దాసోహమైన పత్రికల నుండి, టివి ఛానళ్ల నుండి వెళ్లిపోయిన రాజకీయ విశ్లేషకులు సొంతంగా యూ ట్యూబ్ ఛానళ్లు తెరిచి తమ ఘోషను వినిపిస్తున్నారు. బెదిరింపులకు, కేసులకు లొంగకుండా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్న వారి సాహసానికి సలాం కొట్టాల్సిందే. అయితే అవి సామాన్యుల దాకా చేరవు. ఓట్లపై వాటి ప్రభావం తక్కువే ఉంటుంది.
దక్షిణ భారతంలో కాషాయ పాలన లేనందున ఇక్కడి ప్రభుత్వాలు పత్రికలకు కాస్త నోరు విప్పే అవకాశాన్ని ఇస్తున్నాయి. తెలుగు పత్రికలు చాలా మట్టుకు ప్రాంతీయ పార్టీలకు వత్తాసుగా నిలుస్తున్నా జాతీయ స్థాయిలో బిజెపి, కాంగ్రెస్‌లపై విమర్శలకు అడ్డేమీ చెప్పడం లేదు. అయితే దేశ వ్యాప్తంగా వెళ్లే ఇంగ్లీషు పత్రికలు, వాటి ఆన్‌లైన్ ఎడిషన్లు, ఇంగ్లీషు, హిందీ ఛానళ్లు బహిరంగంగా మోడీ భజన చేస్తున్నాయని తెలుస్తోంది. కొన్ని యూ ట్యూబ్ ఛానళ్లలో మోడీ పాలనపై వాస్తవిక సామాజిక విశ్లేషణ జరుగుతుండగా ప్రధాన మీడియాలో మాత్రం పెద్ద సంఖ్యలో ఆయనకు అనుకూలంగా మాట్లాడేవారిని పిలిపించి వ్యతిరేకంగా మాట్లాడే గొంతులను నొక్కేలా, ఎద్దేవా చేసేలా కార్యక్రమాలను నిర్మిస్తున్నారు. ఈ రకంగా చూస్తే మోడీ మూడోసారి ప్రధాని పీఠంపై కూచోగానే దేశంలో భారీ మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది.
అంబేడ్కర్‌కు దండం పెడుతూనే రాజ్యాంగాన్ని మార్చే చట్టాలు వచ్చేట్లున్నాయి. భిన్న సామాజిక వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లు పలుచబడేలా 10% ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టినా ఎదిరించినవారు లేరు. ముస్లిం తదితర మైనారిటీల పట్ల బిజెపి నేతలు, కార్యకర్తలు బహిరంగంగా విమర్శలకు తెగబడుతున్నారు. హిందూ మతంలోని వర్ణ వ్యవస్థను పెంచి పోషించి దళిత, ఆదివాసీ, నిమ్నవర్గాలను అడుక్కి నెట్టేసి అగ్ర వర్ణాలకు ఊడిగం చేయించే ప్రమాదం ఉంది. వామ పక్షీయులకు, హేతువాదులకు రక్షణ కరువవుతున్నది. నిజానికి ఏ మతం అయినా ఆయా జాతిలో ఉన్న ఉన్నత వర్గాలకే మేలు చేస్తోంది అనేది చారిత్రిక సత్యం.
ఏ కాలంలోనైనా మతం వల్ల రాజులైన క్షత్రియులు, మంత్రులైన బ్రాహ్మలు తప్ప మరే వర్గాలు బాగుపడకపోగా అవి ఎన్నో కష్టనష్టాలు అనుభవించాయి. ఉత్తరభారతంలో ఉన్నంతగా మతమౌఢ్యం దక్షిణాన లేదు. అందుకే బిజెపి ఉచ్చులో వారు పడడం లేదు. అయితే పరిస్థితి ఎలా ఉందంటే దక్షిణ భారత, మైనారిటీల ఓట్లు బిజెపి గెలుపును అడ్డుకోలేవు. మైనారిటీలకు వారు సీట్లు ఇవ్వరు, వారి ఓట్లను ఆశించరు. ఇందువల్ల బిజెపి కోల్పోయేదేమీ లేదు. ఇక దక్షిణ రాష్ట్రాల విషయానికొస్తే గత ఎన్నికల్లో కర్ణాటకలో 25, తెలంగాణాలో 4 చోట్ల తప్ప మిగితా 3 రాష్ట్రాల్లో బిజెపి ఖాతా తెరవలేదు. ఈసారి కర్ణాటకలో కాంగ్రెస్ పాలన ఉన్నందున మళ్ళీ అన్ని సీట్లు రాకపోవచ్చు. ఇక్కడ తేలేదేమిటంటే బిజెపి గెలుపోటములపై దక్షిణాది ప్రభావం శూన్యం. దేశ వ్యాప్తంగా మేము విస్తరించామని బిజెపి చెప్పుకోవడానికే మాత్రమే ఇక్కడి సీట్లు పనికొస్తాయి.
సెక్యులర్ విధానాల విషయంలో బిజెపికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను ఎంచుకోవచ్చు. అయితే గత ఎన్నికల్లో 52 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ మేరకు కోలుకుంటుందో చెప్పలేము. పై సంఖ్యలో సగం దక్షిణాది పుణ్యమే. ఈసారి కూడా అదే పరిస్థితి ఉండొచ్చు. నెహ్రూ కాలం నుండి జాతీయ కాంగ్రెస్‌ని మోడీ నోటికొచ్చినట్లు తీసేసి మాట్లాడుతున్నా ఆయన మాటలకు దీటుగా సమాధానం ఇచ్చే సత్తా ఆ పార్టీలో ఎవరికీ లేదు. సంఖ్యా బలం, పద చాతుర్యంతో మెండుగా ఉన్న మోడీ నిండు సభలో కాంగ్రెస్‌ను కడిగేస్తుంటే ఆ పార్టీ నాయకుల ఎదుర్కోలేకపోయారు. మతమే ఆయన బలం. హిందూ దేవతలను, సంప్రదాయాలను ఉటంకిస్తూ ఓటర్ల మనసులో ‘మన పార్టీ బిజెపి’ అన్నరీతిలో బలమైన ముద్ర వేస్తున్నారు. అలా హిందువుల్లో సగానికి పైగా ఉన్న బహుజన వర్గాలను కూడా భక్తి, ముక్తి మార్గాల పేరుతో తమ బుట్టిలో వేసుకొని మోడీ ప్రచార యాత్ర నడిపిస్తున్నారు.
సున్నితమైన మతం అంశంపై కాంగ్రెస్ నోరు విప్పే పరిస్థితి లేదు. ఎంతో కాలం తమ వెంట నడచిన మైనారిటీ, దళిత వర్గాలను కాంగ్రెస్ ఆకట్టుకోలేక పోతోంది. బిజెపి కేవలం అగ్రవర్ణాల ప్రయోజనమే కోరుతుంది అని, ఆలయాలు, దేవుళ్ళ కన్నా సామాజిక భద్రత ముఖ్యం అని కాంగ్రెస్ ధైర్యంగా చెప్పలేకపోతోంది. హిందువుల్లోని 90% అయిన శ్రామిక, వృత్తి జీవులు మతమాయలో పడిపోయారని ఉత్తర భారత ఓటర్ల ముందు ఘంటాపథంగా ప్రకటించలేకపోతోంది. సామాన్యుల కోసం బిజెపి ఇంతకాలం ఏమి చేసింది, తాము ఏం చేస్తాం అనే స్పష్టతను ఈయడంలో కాంగ్రెస్ విఫలమవుతోంది. ఉత్తరాన పుట్టిన బిజెపి దేశాన్నంతా ఏలుతుంటే దక్షిణాది రాష్ట్రాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి.
మేధావి వర్గం, మానవ వనరులు, ప్రకృతి అనుకూలత ఉన్నా పారిశ్రామిక అభివృద్ధిలో కేంద్రం సహకరించడం లేదు. ఆ రాష్ట్రాల్లో తన జెండా ఎగుర వేయాలని చిన్న పార్టీలపై కక్ష కట్టింది. 2014 నుండి మోడీ పాలనలో దక్షిణది రాష్ట్రాలు చిక్కులే ఎదుర్కొన్నాయి. పదవులకు భ్రమసి దక్షిణాది పార్టీలు బిజెపితో జత కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల విభజన చట్టాన్ని సరిగ్గా అమలు చేయకుండా రెండు రాష్ట్రాలకు అన్యాయం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ అని ఆ చట్టంలో ఉన్నా ఆ రాష్ట్రానికి అది కేంద్రం పనే కాదన్నట్లు పక్కన పెట్టేసింది. తెలంగాణ ఏర్పాటును తల్లిని చంపి బిడ్డని బతికించారని మోడీ ఎప్పుడు అంటుంటారు. మొదటి నుంచి తెలంగాణకు నిధుల కేటాయింపులో బిజెపి వివక్ష చూపుతోంది.
గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించిన ఓటర్లు ప్రధానిని ఖంగు తినిపించారు. కేరళ అంటే మోడీకి ఎప్పుడు కళ్ళ మంటే. వరుస వరదలతో ఆ రాష్ట్రం కుదేలు అవుతే విదేశీ నిధులు సమకూర్చుకునేందుకు కేంద్రం అనుమతి నిరాకరించింది. తమిళ ప్రజలు ద్రావిడ సంప్రదాయాలను పాటిస్తూ రాముణ్ణి ఎప్పుడు దూరముంచుతున్నారు. సనాతన ధర్మంపై నోరు విప్పి ఉదయనిధి స్టాలిన్ ద్రావిడ మార్గాన్ని ప్రకటించారు.
అయితే ఉత్తరాన మార్పుకు ప్రతి రాష్ట్రంలో విపక్షాల ఐక్యత అవసరం. కాంగ్రెస్‌ను మించిన నాయకులు బయటి పార్టీల్లో ఉన్నారు. త్యాగాలకు మారు పేరుగా చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ ప్రధాని పదవిని వదులుకునేందుకు సిద్ధపడాలి. ఇతర పార్టీలకు కోరినంత పెత్తనం స్వేచ్ఛనీయాలి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓటర్లకు మతం, జాతి కన్నా ప్రజాస్వామ్యం, సౌభ్రాతృత్వం దేశ సుస్థిరతకు అత్యవసరమని హితబోధ చేసే సమర్థ గొంతుకలు కావాలి. ప్రణాళికాబద్ధంగా వెళ్లేందుకు సమయమింకా మించిపోలేదు.
బి.నర్సన్ 9440128169