Monday, December 23, 2024

విద్యార్థుల్లో విశ్లేషణ సామర్థ్యం

- Advertisement -
- Advertisement -

‘The art of descriptive writing helps translate a child’s knowledge and ability on paper. written answers also become the primary mode of checking a student’s learning and intellectual skills, fostering them with the ability to explain and refine their understanding of the subject matter’ Vanitha Lokesh , Principal, BMN Public School, Bengaluru

Inclination of students from private to public schools
ప్రత్యామ్నాయం అనేది ఏదేని ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరొక సరిదీటు మార్గం లేదా వసతి. ఇది క్రితం మీద ఉత్తమంగా ఉండకపోయినా ఫరవాలేదు కానీ, ఉన్నతీరును అసలు దిగజార్చరాదు. ఈ కోవలోనే ఆన్‌లైన్ లో తరగతులు ప్రత్యామ్నాయ బోధన విధానంగా చేస్తున్న మేలు కన్నా జరుగుతున్న కీడే అధికమనిపిస్తుంది. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో పిల్లల కు అందవలసిన భాషానైపుణ్యాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఇదే విషయాన్ని జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ (ఎన్‌సిఇఆర్‌టి) నిర్వహించిన అఖిల భారత పాఠశాల విద్యా సర్వే -2021 లో వెల్లడైంది. దేశ వ్యాప్తంగా 65% మంది విద్యార్థులు పరీక్షల్లో వ్యాస రూప సమాధానాలు రాసే అలవాటుకు దూరమవుతున్నారని రిపోర్టు తెలిపింది.

ఇది విద్యార్థుల లేఖన వైఖరికి సంబంధించిన లోపమే కాకుండా, విద్య అందించే ఆరంభ స్థాయి (Grassroots level) నైపుణ్యాలకు సంబంధించిన అతిపెద్ద అఖాతం కూడా. పాఠ్యాంశాలను వస్తుతః విషయాలుగా పిల్లలకు చేరవేయడం పైన్నే కాదు, లేఖన నైపుణ్యాలను అభివృద్ధి పరచడం మీద కూడా పాఠశాల విద్యా కార్యక్రమం ప్రత్యేక దృష్టి సారించాల్సి వుంది. ఎందుచేతనంటే అభ్యాసన నైపుణ్యాలతో పాటు మేధో నైపుణ్యాలను ముందస్తుగా తెలుసుకునే అవకాశం అటు బాలబాలికలతోపాటు, ఉపాధ్యాయులకూ తల్లిదండ్రులకూ యాజమాన్యాలకూ లేఖనాభ్యాసాల ద్వారానే కలుగుతుంది. పిల్లలకుండే నిశిత పరిశీలనా శక్తి కావొచ్చు, నిరంతరం ప్రశ్నలు రూపొందించుకునే మనస్తత్వం కావొచ్చు భాష నుంచి లేఖనం ద్వారా అలవడిన తార్కిక బుద్ధి మూలంగానే సిద్ధిస్తుంది.

లేఖన నైపుణ్యం కొరవడిన పిల్లల్లోని విద్యాసక్తులను ఉపాధ్యాయులు సైతం గుర్తించడం కష్టం. ఉపాధ్యాయుల గుర్తింపుకు నోచుకోని ఏ ప్రతిభాంశం విద్యార్థి మెదడు నుంచి పరిణతి గడించదు. బజ్ ఫీడ్‌లు, హ్యాష్ ట్యాగ్‌లు, ట్వీట్‌ల వంటి సంభాషణాత్మక కురుచ రచనలకు అలవాటైన ఈ యుగపు విద్యార్థులు విద్య, భవిష్యత్తు కెరీర్‌లకు దోహదం చేయగల Long -form writing పై శ్రద్ధ పెట్టకపోవడం ఇవాళ్టి అకడమిక్స్ లో భారీ లోపం. దేశ భవిష్యత్తుకు అవసరమైన సృజనశీలురు, ధీమంతుల ఉత్పాదక స్థలం తరగతే కావడాన భాష గురించిన, భాషావరణ ప్రాముఖ్యత గురించిన, మరీ ముఖ్యంగా లేఖనాభ్యాసాలను గురించిన అవగాహన పాఠశాలతో సంబంధమున్న ప్రతి ఒక్కళ్లకూ అవసరం.

మనిషిని సామాజికం చేసింది భాష. నాగరికుడిగా మార్చింది లిపి. లిపిని రాత అంటున్నాం. ఆంగ్లంలో ‘స్క్రిప్ట్ (Script) అంటారు. ఇంట్లో పుట్టుకతో భాషణం నేర్చుకున్న పిల్లలకు లేఖనం నేర్పించడం ద్వారా పాఠశాల విద్యాభ్యాసం మొదలవుతుంది. అక్షరాలు, గుణింతాలు, ఒత్తులు ఒద్దికగా నేర్పించాక బాలశిక్ష చదివిస్తూ పదాలు వాక్యాలు రాయడం అలవర్చుతుంది. ఎవరికైతే తప్పులు లేకుండా ఉచ్ఛరించడం, రాయడం వస్తుందో వాళ్లే వేగంగా మిగతా అభ్యాసాలు చేయగలుగుతారు. మన సంస్కృతిలో భాషణం కంటే లేఖనానికి ప్రాధాన్యత వెనుకటినుండి ఉన్నదే. దీన్నే విద్యా విధానంలోనూ కొనసాగిస్తున్నాం. భాషణం అందరికీ తెలుసు.

లేఖనం ఇటీవలి వరకు కొంత మందికే వచ్చిన విద్య. లేఖనం వచ్చిన వాళ్లనే అక్షరాస్యులు అంటున్నాం. ఏదైనా ఒక ఒప్పంద పత్రమో, దస్తావేజో రాయాలంటే ఇప్పటికీ గ్రామాల్లో ఒకరిద్దరి వద్దకే జనం వెళ్తుంటారు. మాట్లాడటం సహజ సిద్ధంగా వచ్చేదైతే, నేర్చుకోవడం ద్వారా మాత్రమే రాత అబ్బుతుంది. అందుకే పిల్లలు ఎంత చెప్పగలుగుతున్నారు అనే దాని కంటే, ఎంత రాయగలుగుతున్నారనేదే అభ్యాసనంలో గుణాత్మకత సంతరించుకుంది. ప్రాథమిక విద్యలో ముఖ్యంగా శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం (LSRW) అనే నాలుగు అంశాలను పరీక్షిస్తారు. పరీక్షల్లో లేఖనం కింద ప్రశ్నలకు సమాధానాలు రాయడం మూడు రకాలుగా ఉంటుంది. సంక్షిప్త, సంగ్రహ, సమగ్ర లేదా విపులం అంటూ మూడు రకాల ప్రశ్నలుంటాయి. సంక్షిప్త, సంగ్రహ సమాధానాలు రాసే వాళ్లలో కొద్ది శాతం మాత్రమే సమగ్ర సమాధానాలు రాయగలుగుతారు.

సంక్షిప్త సమాధానం రెండు మూడు వాక్యాల్లో ఉంటుంది. సంగ్రహ సమాధానం నిడివి ఆరేడు వాక్యాలు ఉంటుంది. సమగ్ర సమాధానం వ్యాస రూపంలో ఉంటుంది. జ్ఞాపకశక్తితో పాటు సమగ్ర సమాధానం రాయాలంటే సంబంధిత విషయాన్ని కనీసం ముప్పై నలభై పంక్తుల్లో విడమరచి చెప్పగలగాలి. వ్యాస రూప సమాధానం దగ్గర పిల్లల లేఖన సామర్ధ్యం ఏమిటో తెలిసిపోతుంది. విషయాన్ని వివరించడానికి విద్యార్థి ఎంపిక చేసుకున్న పదాలు, వాక్య నిర్మాణం, ఉదాహరణలు, ప్రాధాన్యతాక్రమాలు లేదా పుటాక్షరాలు (హెడ్డింగ్స్), ఎత్తుగడ, వివరణ, ముగింపు కలిసి వ్యాసరూప సమాధానం ఆకృతి దాల్చుతుంది. సంక్షిప్త సమాధానాలు రాస్తూ, వాటిని కొంచెం యుక్తితో పొడిగించి సంగ్రహ సమాధానాలుగా మార్చడం, పిదప సంగ్రహ సమాధానాలను ఒకదానికొకటి అర్థవంతంగా జోడిస్తూ ప్రశ్నల కోణాన్ని బట్టి భావనా పటిమతో సమగ్ర సమాధానం రాయడం ఒక్కో తరగతి నుండి ఒక్కో అంశంలో అంచెలంచెలుగా విద్యార్థులు నేర్చుకుంటారు. సమగ్ర సమాధానాలు రాసే వాళ్లకే విశ్లేషణా సామర్థ్యం (Analytical power) లేదా విడమరచి రాయ డం (Elabo rative presentation) అనే బుద్ధి కుశలత, విస్తృతి ఉంటాయి.

విశ్లేషణా సామర్థ్యం మూలాన్నే విద్యార్థి పరిశోధకుడు లేదా మేధావి (Scholar) కాగలుగుతాడు. సంక్షిప్త సమాధానాలు విద్యార్థి జ్ఞాపక శక్తిని, సంగ్రహ సమాధానాలు దృక్కోణాన్ని, సమగ్ర సమాధానాలు రచనా కళను, అనుశీలనా రీతికి అద్దం పడతాయి. సమగ్ర లేదా విపుల లేదా వ్యాస రూప సమాధానాలను ఆంగ్లంలో ‘Long -form writing’ అంటున్నారు. దీర్ఘ రూప రచనగా నిర్వచించబడిన ఈ విశ్లేషణాత్మక రచనలో ఒక వెయ్యి నుండి ఏడు వేల ఐదు వందల పదాల దాకా ఉండొచ్చు. బలిష్ఠమైన అధ్యయనం ఆధారంగా సంక్లిష్టమైన విషయాలను లోతుగా విశ్లేషించడానికి పూనుకునే రచయితలు ఎన్నుకునే రూపం దీర్ఘ రూప రచన. విలువైన సమాచారాన్ని అందించడం, కథనాత్మకంగా వివిధ ఉటంకింపులను మేళవించడం ఈ వ్యాసరూప రచనల్లోని విలక్షణత. చదువరులను అలరించడం, ప్రేరణ నింపడం, కొత్త ఆలోచనలను పొందుపరచడం విపులతకు నిదర్శనం. విషయం పరిధికి లోబడి, పరిమితులను అతిక్రమించక, మిక్కిలి వివరాలకు పోకుండా వలసినంత ‘ప్రారంభం -వివరణ- ముగింపు (Beginning, middle, and end)’ అనే మూడు భాగాలను 1+2,3,4+5 ఐదారు పేరాగ్రాఫులుగా ఇంపుగా రాస్తేనే దీర్ఘ రూప సమాధానం అందమైన వ్యాసంగా మారుతుంది.

విపులంగా రాస్తున్నప్పుడు చేసే ఆలోచనలు విషయక్రమాన్ని బాగా గుర్తుంచుకోవడానికి సహాయపడుతాయి. ఆలోచన, వర్కింగ్ మెమరీ రెండింటిలోనూ పాలు పంచుకున్నపుడు మెదడులోని భాగాలు త్వరితగతిన సచేతనం అవుతాయనే సూచనతో పాటు “Long -form writing can help you to establish your self and show to the entire world which you are definitely the most brilliant person on the planet, and it will enable you to demonstrate your understanding of earth. This is by the method of your ideas, opinions and thoughts’ అనే పండితాభిప్రాయాన్ని ఉపాధ్యాయులు పిల్లల తలకెక్కించగలగాలి. వ్యాస రచన విద్యార్థుల విషయ పరిజ్ఞానాన్ని ప్రకాశవంతం చేయగలగడంతో పాటు, విద్యార్థులను మానవీకరించి సామాజీకరించగలదు.

విశ్లేషణాత్మక రచనలో గురుతరమైంది దాని రచనా శైలి. విషయానుగుణంగా శైలీ భేదాలు ఎరుకుండటం ఉపాధ్యాయులకూ చాలా ముఖ్యం. ఈ కారణంగానే ఉపాధ్యాయులు సరైన రచనా శైలిని ఎలా కూర్పు చేయాలో పిల్లలకు నేర్పించగలుగుతారు. అట్లా శిక్షణ తీసుకున్నప్పుడే ఆయా సంఘటనలు, వృత్తాంతాలు, కథనాలను ఎవరెవరు ఎట్లా భావిస్తారో, వాటినే నిర్దిష్టంగా తాను ఏమనుకుంటున్నాడో చెప్పగల సామర్థ్యం విద్యార్థికి సమకూరుతుంది. వ్యాస రూప సమాధాన రచన అనేది విద్యార్థి తన జ్ఞానార్జనను కమ్యూనికేట్ చేసే ప్రక్రియలో అత్యుత్తమమైంది, ఆఖరుది కూడా. ఉపాధ్యాయులు వ్యాస రచనలో ఉపయోగించగల విషయాల సుదీర్ఘ జాబితాను విద్యార్థులకు సిద్ధం చేసి చూపవచ్చు.

తను సైన్స్ విద్యార్థి అయితే, తన ప్రయోగ కార్యాన్ని గొప్పగా ప్రచారం చేయడానికి వ్యాసరూప సమాధానాన్ని ఉపయోగించవచ్చు. ఆర్ట్‌లో ఉన్నట్లయితే, తన రాజకీయ దృక్పథాన్ని ప్రచారం చేయడానికి ప్రస్ఫుటం చేసుకోవచ్చు. తాను అద్భుతమైన రచయిత అయితే కళాత్మక అభివ్యక్తికి, రసాస్వాదనకు వాహిక చేసుకోవచ్చు. తాను నమ్మిన సత్యాన్ని ఆవిష్కరించడానికి, సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి విశ్లేషణ కోసం దీర్ఘ రూప రచన లేదా వ్యాసరచన మంచి వారధి. ప్రస్తుతం నాలెడ్జ్ ఎకానమీలో తన దృక్పథాన్ని మార్కెట్ చేయడానికి విద్యార్థికి ఈ లేఖన ప్రక్రియ అవకాశమివ్వడంతో పాటు గొప్ప ఎక్స్‌పోజర్ కూడా. అందుకనే ‘Teachers need to take quick and specific actions to ensure that students get back into the habit of long- form writing at earliest’ అంటున్నారు వనితా లోకేశ్. ప్రత్యక్ష తరగతుల్లోనే అంతంత మాత్రం గా లభ్యమయ్యే ఉత్తమ లేఖనా నైపుణ్యాలు ఇక ఆన్‌లైన్‌లో ఎట్లా విద్యార్థులకు ఎట్లా పూర్తి స్థాయిలో అందగలవో యోచించి విద్యా మంత్రిత్వశాఖ ప్రణాళికతో తక్షణం చర్యకు ఉపక్రమించాలి.

డా. బెల్లియాదయ్య
9848392690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News