‘బేబీ’ సినిమాతో ఇటీవల బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఆయన ప్రస్తుతం ‘గం..గం..గణేశా’ అనే కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటిదాకా తను చేయని యాక్షన్ జానర్‌లో ఆనంద్ ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆదివారం ఆనంద్ దేవరకొండ తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా విడుదల చేశారు. పోస్టర్‌లో రెండు రైఫిల్స్ పట్టుకుని ఆనంద్ కనిపిస్తున్నారు.
మొత్తంగా ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీ మీద ఆసక్తిని కలిగించింది. ‘గం..గం..గణేశా’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేస్తూ ఇది యాక్షన్ మూవీనా?, కామెడీ మూవీనా? త్వరలో మనం తెలుసుకుందాం. మరిన్ని వివరాలు, ఆసక్తికరమైన అప్ డేట్స్ రాబోతున్నాయి. అని క్యాప్షన్ రాశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేస్తూ టీమ్‌కు బెస్ట్ విశెష్ తెలిపింది స్టార్ హీరోయిన్ సమంత. మూవీ ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు.