Tuesday, December 3, 2024

పదమూడేళ్ల బాలికకు ఉద్యోగం ఇచ్చిన ఆనంద్ మహీంద్ర!

- Advertisement -
- Advertisement -

తెలివితేటలు కనబరిచిన యువతీ యువకులను ప్రోత్సహించడంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ముందువరసలో ఉంటారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టే స్ఫూర్తిదాయకమైన పోస్టులను లక్షలాది మంది వీక్షిస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఓ పదమూడేళ్ల బాలికకు ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆ బాలిక ఎవరంటే… ఆమె పేరు నికిత. తన ఇంట్లోకి ప్రవేశించిన ఓ కోతుల గుంపును తరిమేందుకు వినూత్నంగా ఆలోచించి, అందరి ప్రశంసలూ పొందిన బాలిక ఆమె.

ఉత్తరప్రదేశ్ లోని బస్తి అనే జిల్లాకు చెందిన నికిత తన 18 నెలల వయసున్న మేనకోడలితో ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఓ కోతుల గుంపు ఇంట్లోకి ప్రవేశించి, బీభత్సం సృష్టించడం మొదలుపెట్టింది. ఏం చేయాలో నికితకు పాలుపోలేదు. కానీ అంతలోనే తేరుకుని ‘అలెక్సా’కు కుక్కలా మొరగమని ఆదేశించింది. దాంతో అలెక్సాలోంచి కుక్క మొరుగుతున్నట్లు శబ్దాలు రావడంతో ఇంట్లో నిజంగా కుక్క ఉందని భ్రమించిన ఆ కోతులు తోక ముడిచాయి.

పత్రికల్లో వచ్చిన ఈ వార్త ఆనంద్ మహీంద్రాను ఆకర్షించింది. ఈమేరకు ఆయన ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘టెక్నాలజీకి మనం బానిసలుగా మారతామా లేక దానికి అధినేతలమవుతామా అనేది ఈ కాలంలో ప్రధాన ప్రశ్నగా మారింది. టెక్నాలజీ అనేది మానవ మేధస్సుకు అద్దం పడుతుందనడానికి ఈ చిన్నారి ఉదంతమే ఉదాహరణ. తన చదువు పూర్తయ్యాక ఆమె కార్పొరేట్ రంగంలో పనిచేయాలనుకుంటే మా సంస్థలో పనిచేయవచ్చు’ అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News