న్యూస్‌డెస్క్: ఆస్కార బరిలో పోటీ పడుతున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. భారతదేశంలోని వివిధ భాషలకు చెందిన సినీ ప్రేమికుల హృదయాలను చూరగొన్న నాటునాటు పాటకు విదేశీయులు సైతం ఫిదా అయిపోతున్నారు. కాగా..ఇప్పుడు తాజాగా మహింద్ర కంపెనీ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కూడా నాటునాటు పాటకు స్టెప్పులేశారు. ఆ చిత్ర హీరోలలో ఒకరైన రాంచరణ్‌తో కలసి ఆనంద్ మహీంద్ర నాటునాటు పాటకు కాలు కదిపారు.
రాం చరణ్ డ్యాన్స్ మాస్టర్ అవతారమెత్తగా పాటకు తగ్గట్టుగా ఆనంద్ మహీంద్ర స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన మహీంద్ర తనకు స్టెప్పులు నేర్పించిన గురువు రాంచరణ్‌కు కృతజ్ఞతలు తెలియచేయడంతోపాటు ఆర్‌ఆర్‌ఆర్ ఆస్కార్‌లో విజేతగా నిలవాలని ఆకాంక్షిస్తూ పోస్ట్ పెట్టారు. దీనికి రాంచరణ్ స్పందిస్తూ నాకన్నా వేగంగా మీరే స్టెప్పులు నేర్చుకున్నారంటూ ఆనంద్ మహీంద్రను ప్రశంసించారు. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటునాటు పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఇటీవల 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే.