కఠిన చర్యలు తీసుకోవాలని సోనియాకు విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పని తీరును ప్రశ్నించిన పార్టీ నేత కపిల్ సిబల్ ఇంటి వద్ద పార్టీ కార్యకర్తలు గొడవ చేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ గురువారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దాడితో సంబంధం ఉన్న వారిపై కఠిన చర్య తీసుకోవాలని ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు. భిన్నాభిప్రాయాలు, భిన్న భావాలు ప్రజాస్వామ్యంలో భాగమని ఆనంద్ శర్మ అంటూ అసహనం, హింస కాంగ్రెస్ పార్టీ విలువలు, సంస్కృతికి దూరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పూర్తి ప్రక్షాళన చేయాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన ‘గ్రూప్ 23’(23 మంది అసమ్మతి నేతల గ్రూపు)లో కపిల్ సిబల్‌తో పాటుగా ఆనంద్ శర్మ కూడా ఉన్న విషయం తెలిసిందే. ‘ కపిల్ సిబల్ నివాసం వద్ద దాడి, పోకిరి చర్యల వార్త్త తెలిసి దిగ్భ్రాంతి, ఆందోళనకు గురయ్యా. ఇలాంటి చర్యలు పార్టీకి అగౌరవాన్ని కలిగిస్తాయి. వీటిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది’ అని శర్మ వరస ట్వీట్లలో పేర్కొన్నారు.
అంతేకాదు భావప్రకటనా స్వేచ్ఛను పరిరరక్షించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని కూడా ఆయన అన్నారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి, వారిపై గట్టి చర్య తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరుతున్నట్లు ఆనంద్ శర్మ ఆ ట్వీట్లలో తెలిపారు, బుధవారం కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీ పనితీరును ప్రశ్నించాక వివిధ వర్గాలు ఆయనను తప్పుబట్టడంతో పాటు, పార్టీ కార్యకర్తలు ఆయన నివాసం వద్ద ఆందోళన కూడా చేశారు. సిబల్ వ్యాఖ్యతు తమను బాధించాయని పేర్కొంటూ ఢిల్లీ పిసిసి కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ జోర్‌బాగ్‌లోని ఆయన నివాసం వద్ద ఆందోళన చేశారు. కపిల్ సిబల్ నివాసం వద్ద పార్టీ శ్రేణుల ‘దాదాగిరి’పట్ల మరో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.