శివసేన నేత, మాజీమంత్రి అనంత్‌గీతే
ముంబయి: కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచి ఎన్‌సిపిని స్థాపించిన శరద్‌పవార్ శివసైనికులకు ‘గురు’ కాలేరంటూ శివసేన నేత, కేంద్ర మాజీమంత్రి అనంత్‌గీతే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌ల మధ్య అడ్జస్ట్‌మెంట్ ద్వారానే మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ(ఎంవిఎ) ప్రభుత్వం ఏర్పాటైందని ఆయన అన్నారు. శివసేన వ్యవస్థాపకుడు, దివంగత బాలాసాహెబ్ ఠాకరే మాత్రమే తమ ‘గురు’ అని గీతే స్పష్టం చేశారు. గీతే వ్యాఖ్యలపై శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌రౌత్‌ను ప్రశ్నించగా, తనకు ఆ వ్యాఖ్యల గురించి తెలియదన్నారు. అయితే, మూడు పార్టీల కూటమి ద్వారా ఏర్పాటైన తమ ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగుతుందన్నారు.
శరద్‌పవార్‌ను దేశానికి నాయకుడని రౌత్ అన్నారు. రాయ్‌గడ్ నుంచి గతంలో ఎంపీగా గెలిచిన గీతే తన సొంత నియోజకవర్గంలో జరిగిన ఓ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోవాలని తాను కోరుకోవడంలేదని గీతే అన్నారు. విడిపోయేంతవరకు ప్రభుత్వం కొనసాగుతుందని, ఆ తర్వాత తమకు తమ పార్టీ శివసేన ఉంటుందన్నారు. 1999లో కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు సోనియాగాంధీకి అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన శరద్‌పవార్ ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురై ఎన్‌సిపిని స్థాపించడం గమనార్హం. ఇటలీలో పుట్టిన సోనియా దేశానికి ఎలా నాయకురాలవుతారని ఆ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.