Thursday, January 23, 2025

కశ్మీర్‌లో టెర్రరిజం

- Advertisement -
- Advertisement -

అనంత్‌నాగ్ భారీ ఎన్‌కౌంటర్ తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలన సుదూర స్వపమేనని భావించక తప్పడం లేదు. కేంద్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకొని, ఎంత గట్టి భద్రతా కవచాన్ని ఏర్పాటు చేసినా టెర్రరిస్టులు సరిహద్దులకు అవతలి వైపునున్న పాకిస్థాన్ నుంచి అదే పనిగా కశ్మీర్‌లోకి ప్రవేశిస్తున్నారని మరొకసారి మరింత గట్టిగా రుజువైంది. గత బుధవారం నాడు దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా అడవుల్లో గల గడుల్ కోకెర్‌నాగ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికాధికారులు, ఒక డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం నాడు మరొక సైనికుని మరణం టెర్రరిస్టుల పైచేయిని నిరూపించింది. అయితే ఉరి ప్రాంతంలో కశ్మీర్‌లోకి చొచ్చుకురాడానికి ప్రయత్నించిన ముగ్గురు టెర్రరిస్టులను శనివారం ఉదయం సైన్యం హతమార్చింది. అనంత్‌నాగ్‌లో రెండు వర్గాల మధ్య కాల్పులు నాలుగు రోజులైనప్పటికీ ఇంకా కొనసాగుతుండడం గమనించవలసిన విషయం.

దట్టమైన అటవీ ప్రాంతంలోని ఒక కొండ మీద గల గుహలో దాగి వున్న టెర్రరిస్టుల కోసం అడుగు వేయడం కష్టమయ్యే నడక దారిలో సైనికులు వెళ్ళినప్పుడు ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకొన్నది. కొండ పైనున్న టెర్రరిస్టులకు కిందనున్న సైన్యం కదలికలు స్పష్టంగా కనిపిస్తూ వుండడం వారికి అనువుగా ఉపయోగపడినట్టు బోధపడుతున్నది. పైకి వెళ్ళడానికి సైనికులకున్న ఒకే ఒక్క మార్గం చాలా సన్నగా వుండడం కూడా ఇందుకు మరో కారణం. ఆ దారికి ఒక వైపు లోయ వున్నందు వల్ల సైనికులకు గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. టెర్రరిస్టుల వద్ద ఆయుధాలు, మందుగుండు నిల్వలు, ఆహారం కూడా చాలినంతగా వున్నట్టు బోధపడుతున్నది. నాలుగు రోజులవుతున్నా వారు కొండ మీది నుంచి కిందికి దిగే ప్రయత్నం చేయకపోడానికి ఇదే కారణమని తెలుస్తున్నది. కొండపైన టెర్రరిస్టులు భారీ సంఖ్యలో వుండవచ్చునని భావిస్తున్నారు. అన్నిటికీ తోడు వాతావరణం కూడా సైన్యానికి సహకరించలేదు.

ఎత్తయిన కొండల్లో చేరి తమ కార్యకలాపాలు నిర్వహించాలనే సరికొత్త వ్యూహాన్ని టెర్రరిస్టులు ఎంచుకొన్నారని సైనికాధికారులు భావిస్తున్నారు. గతంలో జనావాసాల మధ్య వుండి దాడులు జరుపుతూ వచ్చిన టెర్రరిస్టులు ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకొన్నారని సమాచారం. అయితే జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ఇంత కాలం పోలీసులు, సైన్యం, భద్రతా దళాల సహకారంతో టెర్రరిస్టుల నిర్మూలన కోసం కేంద్రం చేస్తున్న కృషి తగిన ఫలితాలను ఇవ్వడం లేదా అనే ప్రశ్న ఈ సమయంలో సహజంగానే తలెత్తుతున్నది. పాకిస్థాన్‌ను టెర్రరిస్టు దేశంగా పరిగణించి ఏకాకిని చేయాలని కేంద్ర మంతి వికె సింగ్ అంతర్జాతీయ సమాజానికి పిలుపు ఇచ్చారు. తీరు మార్చుకోకపోతే దానితో సత్సంబంధాలు పెట్టుకోడం సాధ్యం కాదని పాకిస్థాన్‌కు తెలియజేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంకొక వైపు పాకిస్థాన్‌తో భారత దేశం చర్చలు జరిపే వరకు టెర్రరిజం అవిశ్రాంతంగా కొనసాగుతుందని కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, గుప్కార్ డిక్లరేషన్ ప్రజాకూటమికి చెందిన ఫారూక్ అబ్దుల్లా చేసినట్టు చెబుతున్న హెచ్చరిక గమనించదగినది.

కశ్మీర్‌లో టెర్రరిజం ప్రబలడానికి భారత ప్రభుత్వమే కారణమని, అక్కడ పాకిస్థాన్‌కు న్యాయమైన ప్రయోజనాలు వున్నాయని, దానితో ఇండియా చర్చించి తీరాలని ఫారూక్ అబ్దుల్లా అభిప్రాయపడుతున్నట్టు స్పష్టమవుతున్నది. కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని, దాని రాష్ట్ర హోదాను రద్దు చేసిన తర్వాత అక్కడి పరిస్థితులను పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకోడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు బొత్తిగా ఫలించడం లేదని ఈ పరిస్థితి వెల్లడిస్తున్నది. గుప్కార్ కూటమికి కశ్మీర్ ప్రజల్లో చెప్పుకోదగిన మద్దతు వుందని జిల్లా అభివృద్ధి మండళ్ళకు జరిగిన ఎన్నికలు నిరూపించాయి. కేంద్ర పాలక పక్షం భారతీయ జనతా పార్టీకి జమ్మూలో ప్రాబల్యం వున్నప్పటికీ కశ్మీర్ లోయ ప్రజలు దానిని నమ్మడం లేదని వెల్లడవుతున్నది. టెర్రరిస్టులను పూర్తిగా మట్టుబెట్టడం ద్వారా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి కశ్మీర్ ప్రజలను ఆకట్టుకోవచ్చని ప్రధాని మోడీ ప్రభుత్వం ఎంచుకొన్న వ్యూహం ఇప్పటికీ ఫలితాలను ఇవ్వడం లేదని అనుకోవలసి వస్తున్నది.

అంతేగాని ఫారూక్ అబ్దుల్లా గాని, ఇతర గుప్కార్ అలయెన్స్ పార్టీలు గాని ఇండియాకు వ్యతిరేకులుగా మారారని భావించలేము. కశ్మీర్‌లో కేంద్ర పాలకులు ఆశిస్తున్న మార్పును ఏకపక్షంగా, పార్లమెంటులో తమకున్న బలంతో తీసుకు రాదలచడం సవ్యమైన పద్ధతి కాదని అనుభవంతో తెలుస్తున్నది. కశ్మీర్ ప్రజలతో మంచి సంబంధాలు పెట్టుకోడం ద్వారానే అక్కడ శాంతిని నెలకొల్పవచ్చని, పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పడానికి కూడా అదే మార్గమని భావించక తప్పడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News