Tuesday, November 26, 2024

అనన్య ప్రతిభ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యుపిఎస్‌సి నిర్వహించిన సివిల్స్ 2023 తుది ఫలితాలు విడుదలయ్యా యి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఆ దిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు, అ నిమేష్ ప్రధాన్‌కు రెండో ర్యాంకు రాగా, తెలుగమ్మాయి అనన్యరెడ్డి జాతీ య స్థాయిలో మూడో ర్యాంకుతో మెరిశారు. 2023 ఏడాదికి గాను 1016 మందిని యుపిఎస్‌సి ఎంపిక చేసింది. నాలుగో ర్యాంకు పీకే సిద్ధార్థ్ రామ్ కు మార్, ఐదో ర్యాంకు రుహనీకి వచ్చింది. జనరల్ కేటగిరి కింద 347, ఇడబ్ల్యూఎస్ కింద 115, ఒబిసి కేటగిరీలో 303, ఎస్‌సి కేటగిరి కింద 165, ఎస్‌టి కేటగిరిలో 86 మందిని యుపిఎస్‌సి ఎంపిక చేశారు. 180 మంది ఐఎఎస్ పోస్టులకు, 37 మంది ఐఎఫ్‌ఎస్ పోస్టులకు, 200 మంది ఐపిఎస్ పోస్టులకు, 613 మంది సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఎ పోస్టులకు, 113 మంది గ్రూప్ బి సర్వీసులకు ఎంపికయ్యారు.

తొలి ప్రయత్నంలోనే పాలమూరు అమ్మాయికి మూడో ర్యాంకు
యుపిఎస్‌సి సివిల్స్ ఫలితాల్లో పాలమూరు మట్టిబిడ్డ మెరిసిపోయింది. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి సత్తా చాటారు. మహబూబ్‌నగర్‌కు జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించింది. ఆలిండియాలో థర్డ్ ర్యాంకు సాధించిన అనన్యకు అభినందనలు వెలువెత్తుతున్నాయి. అనన్య తొలి ప్రయత్నంలోనే తన అసాధారణ ప్రతిభతో మూడో ర్యాంకు సాధించారు. పదో తరగతి వరకు మహబూబ్‌నగర్ గీతం హైస్కూల్లో చదివిన అనన్య.. ఇంటర్ విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. ఢిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె ఎంతో కష్టపడి చదివి సివిల్స్‌లో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సివిల్స్ మీద దృష్టి సారించానని చెప్పారు.రోజుకు 12 నుంచి 14 గంటల పాటు కష్టపడి చదివానని పేర్కొన్నారు. ఆంథ్రోపాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నానని, ఇందుకు హైదరాబాద్‌లోనే కోచింగ్ తీసుకుని పకడ్బందీగా ప్రిపేరయ్యానని చెప్పారు. అయితే ఈ ఫలితాల్లో మూడో ర్యాంకు వస్తదని ఊహించలేదని అనన్య రెడ్డి తెలిపారు. చిన్నప్పటినుంచే సమాజానికి సేవ చేయాలన్న కోరికతోనే సివిల్స్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు.తమ కుటుంబంలో సివిల్స్ సాధించిన తొలి అమ్మాయిని తానేనని చెప్పారు.

సివిల్స్‌లో సత్తా చాటిన కరీంనగర్ కుర్రాడు
సివిల్స్ ఫలితాల్లో కరీంగనగర్ జిల్లాకు చెందిన నందల సాయి కిరణ్ సత్తా చాటారు. చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన సాయి కిరణ్ 27వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సాయి కిరణ్‌ను అభినందించారు.

సాఫ్‌వేర్ ఉద్యోగం వదులుకుని సిలిల్స్‌కు ప్రిపేపరయ్యా : కౌశిక్
సివిల్స్‌ను ఎంపిక కావడమే లక్ష్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదులుకొని మెయిన్స్‌కు ప్రిపేర్ అయిన మెరుగు కౌశిక్.. తొలి ప్రయత్నంలోనే 82వ ర్యాంకుతో సత్తా చాటారు. సివిల్ ఇంజినీరింగ్‌లో బి.టెక్ పూర్తి చేసిన ఆయన.. ఢిల్లీలో ఎంబిఎ చేశారు. అందరూ చదివినట్లే చదివానని.. రోజుకు ఎనిమిది, తొమ్మిది గంటల పాటు ప్రిపేర్ అయినట్లు చెప్పారు. చదువుకుంటున్న సమయంలోనే సివిల్స్‌కు ప్రిపరేషన్ మొదలు పెట్టానని, ఆ తర్వాత ఏడాది పాటు జాబ్ చేశానని తెలిపారు. ప్రిలిమ్స్ తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి మెయిన్స్ రాసినట్లు పేర్కొన్నారు. ఐఏఎస్ అవ్వాలనేది నా లక్ష్యం అని చెప్పారు. తనకు 100లోపు ర్యాంకు వస్తుందని మాత్రం అసలు ఊహించలేదు. సెలెక్ట్ అయితే చాలనుకున్నా.. కానీ.. అదృష్టం, దేవుడి దయవల్లే ఈ ర్యాంకు సాధించానని తెలిపారు. తన తండ్రి నిర్మాణ రంగంలో ఉన్నారని, తల్లి గృహిణి అని చెప్పారు.

కాళ్లు కదలకపోయినా.. పట్టువిడవని సంకల్పంతో ర్యాంకు సాధించిన హనిత
విధి వంచించినా.. విశ్వాసం ఆమెను నిలబెట్టింది. కాళ్లు కదలకపోయినా.. పట్టువిడవని సంకల్పం తనను ముందుకు నడిపింది. ఊహించని అనారోగ్యం ఇంటికే పరిమితం చేసినా.. చదువును మాత్రం ఏనాడు దూరం చేసుకోలేదు. దూరవిద్య ద్వారా చదువులు పూర్తిచేసి కుటుంబ సభ్యులు, గురువుల సహకారంతో హనిత వేములపాటి సివిల్స్‌లో 887వ ర్యాంక్ సాధించి సత్తాచాటారు. విశాఖపట్నానికి చెందిన హనిత
సివిల్స్‌లో ఎంపికైన సందర్భంగా తను ఆత్మవిశ్వాసంతో తన చదువును కొనసాగించి సివిల్స్ ప్రిపేరయ్యానని తెలిపారు. దేశంలోనే అత్యున్నత సివిల్స్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని హనిత తెలిపారు.

సివిల్స్‌కు ఎంపికైన జస్టిస్ రామస్వామి మనవరాలు
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామస్వామి మనవరాలు ఐశ్వర్య నీలిశ్వామల సివిల్స్ 649 ర్యాంకు సాధించారు. బి.టెక్ పూర్తి చేసిన ఐశ్వర్య ప్రణాళికాబద్ధంగా ప్రిపేరై సివిల్స్‌లో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. తన తాత జస్టిస్ రామస్వామి తనను ఎంతగానో ప్రేరేపించారని, అందుకే ప్రజాసేవ చేయాలనే లక్షంతో సివిల్స్ రాశానని అన్నారు. తండ్రి సివిల్ సర్వెంట్, తల్లి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యురాలు అని, తన మామ ఐఎఎస్ అధికారి అని పేర్కొన్నారు.
అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి : అలేఖ్య
జీవితంలో విజయాలతో పాటు అపజయాలను ధైర్యంగా ఎదుర్కోవాలని సివిల్స్‌లో 938 ర్యాంకు సాధించిన రావూరి సాయి అలేఖ్య పేర్కొన్నారు. తమది ఖమ్మం జిల్లా అని, తన తండ్రి పోలీసు శాఖలో పనిచేస్తున్నారని తెలిపారు. ఫలితం ఏదైనా తన తల్లిదండ్రులు ఎప్పుడూ తనను నిరాశపరచలేదని చెప్పారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తను సివిల్స్‌లో ర్యాంకు సాధించానని అన్నారు.

సిఎస్‌బి అకాడమీ నుంచి 16 మంది ఎంపిక
సిఎస్‌బి ఐఏఎస్ అకాడమీ నుంచి 16 మంది ఎంపికయ్యారు. మెరుగు కౌషిక్ 82, పెంకేసు ధీరజ్ రెడ్డి 173, భానుశ్రీ 198, హరిప్రసాద్ రాజు 475, కే శ్రీనివాసులు 526, కిరణ్ సాయింపు 568, మర్రిపాటి నాగభరత్ 580, ఐశ్వర్య నీలిశ్యామల 649, రాజ్ కుమార్ చౌహాన్ 703, ఆదా సందీప్ కుమార్ 830, జె. రాహుల్ 873, హనిత వేములపాటి 887, కే శశికాంత్ 891, కెసారపు మీన 899, రావూరి సాయి అలేఖ్య 938, గోవద నవ్యశ్రీకి 995 ర్యాంకు పొందారు. ఈ సందర్భంగా సిఎస్‌బి అకాడమీ చైర్మన్ బాలలత మాట్లాడుతూ, సివిల్స్‌లో తమ అకాడమీ విద్యార్థులు 16 మంది ఎంపికై సత్తా చాటారని అన్నారు.

ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని తమ విద్యార్థులు విజయాలు సాధించారని తెలిపారు. కొంతమంది విద్యార్థులు పట్టు వదలకుండా మూడు నాలుగు సార్లు సివిల్స్‌కు హాజరై విజయం సాధించారని అన్నారు. తమ విద్యార్థుల్లో చాలామంది సాధారణ కుటుంబాల నుండి వచ్చి విజయాలు సాధించారని చెప్పారు. సివిల్స్ ఎంపికైన తమ విద్యార్థులు దేశానికి, ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బాలలత అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News