Thursday, December 19, 2024

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్: అండర్సన్‌కు అగ్రస్థానం..

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇదే సమయంలో సుదీర్ఘ కాలంగా అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ పాట్ కమిన్స్ మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక ర్యాంక్‌ను మెరుగుపరుచుకుని రెండో స్థానంలో నిలిచాడు.

ఇక ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పది వికెట్లతో అదరగొట్టిన భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి తొమ్మిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. జడేజా ప్రస్తుతం 763 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. మరోవైపు అండర్సన్ 866 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అండర్సన్ భారత బౌలర్ అశ్విన్ కంటే కేవలం రెండు రేటింగ్ పాయింట్ల ఆధిక్యంలో మాత్రమే ఉన్నాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే మిగిలిన రెండు టెస్టుల్లో మెరుగ్గా రాణిస్తే అశ్విన్‌కు టాప్ ర్యాంక్ లభించినా ఆశ్చర్యం లేదు. అశ్విన్ ప్రస్తుతం 864 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

కాగా, ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న కమిన్స్ 858 పాయింట్లతో మూడో ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. భారత్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో కమిన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. ఇదిలావుంటే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ మార్నస్ లబుషేన్ 912 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాకే చెందిన స్టీవ్ స్మిత్ 875 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ నాలుగో, జో రూట్ (ఇంగ్లండ్) ఐదో ర్యాంక్‌ను కాపాడుకున్నారు. భారత్‌కు చెందిన రిషబ్ పంత్ ఆరో, కెప్టెన్ రోహిత్ శర్మ ఏడో ర్యాంక్‌లో నిలిచారు. ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. మరో స్టార్ అక్షర్ పటేల్ ఐదో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News