సెలవు పెట్టి గంజాయి రవాణా
ఎపిఎస్పిలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు
22కిలోల గంజాయి స్వాధీనం
మనతెలంగాణ,సిటిబ్యూరోః గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకోవాల్సిన పోలీసులే గంజాయిని రవాణా చేస్తు పట్టుబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పోలీసులు గంజాయిని రవాణా చేస్తు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ ఎస్‌ఓటి పోలీసులకు శుక్రవారం పట్టుబడ్డారు.
ఆంధ్రా నుంచి ఓ కారులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం రావడంతో బాలానగర్ ఎస్‌ఓటి పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే ఎపి 39 క్యూహెచ్ 1763 నంబర్ గల కారును ఆపి తనిఖీ చేయగా 11 ప్యాకెట్లలో 22 కేజీల గంజాయి లభించింది. గంజాయి విలువ రూ.8లక్షలు ఉంటుంది. గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా, వారు చెప్పిన విషయాలు విని పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఏపీ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా కాకినాడలోని థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్( 35) , కానిస్టేబుల్ శ్రీనివాస్ (32 ) అని తెలిసింది. గంజాయి స్మగింగ్‌తో పెద్ద ఎత్తున్న డబ్బు సంపాదించవచ్చనే ఆశతో పోలీసులు ఈ దందా చేస్తున్నట్లు తెలిసింది. ఇద్దరు పోలీసులు ఆరోగ్యం బాగోలేదని వంకతో డ్యూటీకి సెలవు పెట్టి మరీ గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.
ఇద్దరు పోలీసులు గంజాయిని నర్సిపట్నం నుంచి బాచుపల్లికి రవాణా చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నారు. ఈ ఘటన ఏపీ పోలీస్‌శాఖలో ఒక్కసారిగా దుమాన్ని రేపింది. ఇద్దరు పోలీసులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.