Friday, November 8, 2024

ఎపిలో కులగణన

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్టే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడలో 125 అడుగుల ఎత్తయిన బాబాసాహెబ్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఇరుగుపొరుగు తెలుగు రాష్ట్రాలు రెండూ ఈ దేశ బాధిత, అణగారిన జనబాహుళ్య బాంధవుడి ఆకాశమెత్తు విగ్రహాలను నెలకొల్పడం ద్వారా ఆ ప్రజలతో పూర్తి మమేకాన్ని ప్రకటించుకోడం చారిత్రాత్మక పరిణామంగా నిలిచిపోతుంది. రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా గత శతాబ్దాల కాలమంతా దేశ మెజారిటీ జనాన్ని అంటరానితనం, ఆత్మగౌరవ హననంతో, కుల వివక్షతో అణగదొక్కి వికృత ఆనందంలో కుంగికునారిల్లిన దేశానికి సర్వసమాన ఓటు హక్కును కల్పించి సామాజిక న్యాయమనే కొత్తచూపును కలిగించి జ్యోతిరావు ఫూలే బాటలో మహోజ్వల విప్లవ జ్యోతిగా వెలుగుతున్న అంబేడ్కర్ నిజమైన భారత భాగ్యవిధాత. ఆయన విగ్రహావిష్కరణతో పాటు కులాలవారీ జనగణనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టడం ఒక విశేష పరిణామం.

సామాజిక న్యాయ సాధనను సమగ్ర స్థాయికి తీసుకుపోడానికి దారితీసే ఈ ఆలోచనను అమల్లో పెడుతున్న రెండవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలో కులగణనను చేపట్టిన మొదటి రాష్ట్రం ఖ్యాతిని బీహార్ సాధించింది. కులగణన వల్ల వెనుకబడిన తరగతుల జనాభా స్పష్టంగా తెలుస్తుందని, వారి వాస్తవ స్థితిగతులు వెల్లడి అవుతాయని, సంక్షేమాన్ని మరింత మెరుగ్గా అమలు చేసి వారికి ఇప్పటి కంటే బలమైన చేయూతను అందించడానికి అది కరదీపికగా ఉపయోగపడుతుందని భావించారు. జాతీయ స్థాయిలో దానిని చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీని నితీశ్ కుమార్ బృందం స్వయంగా కలుసుకొని అర్థించినా ప్రయోజనం లేకపోయింది. దానితో రూ. 500 కోట్ల వ్యయంతో స్వరాష్ట్రంలో రెండు దశల్లో నితీశ్ ప్రభుత్వం కులగణన చేపట్టి పూర్తి చేసింది. అందుకోసం న్యాయ పోరాటం చేసి సుప్రీం కోర్టు నుంచి అనుమతిని పొందింది. బీహార్ ప్రభుత్వ జాబితాలోని 214 కులాల కుటుంబాలను కలుసుకొని ఈ గణనను నిర్వహించారు. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం చివరి సారిగా జాతీయ స్థాయిలో జరిపిన కులగణన తర్వాత దేశంలో ఒక రాష్ట్ర స్థాయిలో మళ్లీ దానిని సాధ్యం చేసిన గొప్పతనం బీహార్‌కే దక్కింది.

బీహార్‌లో ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసి) జనాభా 63.14% వున్నట్టు వెల్లడయింది. దేశ జనాభాలో ఒబిసిలు సగానికి పైగా ఉంటారని భావిస్తున్నారు. వాస్తవ సంఖ్య నిర్ధారణ కావలసి ఉంది. ఇటీవలి కాలం వరకు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకే పరిమితమై ఉండిన సామాజిక న్యాయ రాజకీయాలు ఇప్పుడు త్వరగా దేశంలోని ఇతర ప్రాంతాలకు సైతం వ్యాపిస్తున్నాయంటే అందుకు కారణం బిసిల ఓటు బలమే. ఇంత కాలం అగ్రవర్ణాల పార్టీగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సామాజిక న్యాయ నినాదాన్ని చేపట్టింది. దేశాధికారం తమకు లభిస్తే కులగణన చేపడతామని రాహుల్ గాంధీ పదేపదే ప్రకటిస్తున్నారు. గత నవంబర్‌లో చత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే కులగణనను జరిపిస్తామని వాగ్దానం చేశారు. దాని ద్వారా బిసిల వాస్తవ జనసంఖ్య వెల్లడై దేశ గతినే మార్చివేస్తుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ మతపరమైన చీలిక ద్వారా అందుకు సంబంధించిన భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా కుల గణనను కప్పిపుచ్చి హిందూ ఓటు బ్యాంకు పెంచుకొని అధికారంలో కొనసాగాలని మళ్ళీ మరింత గట్టి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కుల గణన

డిమాండ్‌ను ముందుకు తీసుకుపోడం ద్వారా దాని ఎత్తుగడను చిత్తు చేయాలని ప్రతిపక్షం ఆశిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక్ష నగదు చెల్లింపు ద్వారా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బలమైన సంక్షేమ పునాదిని వేసుకోగలిగింది. కులగణనతో దీనిని మరింత పటిష్టపరచుకొని ప్రతిపక్షం మీద పైచేయిని కాపాడుకోదలచిందని బోధపడుతున్నది. రాష్ట్రంలో రిజర్వేషన్లను పాత గణాంకాల ప్రాతిపదికనే ఇస్తున్నందున ఎస్‌సి, ఎస్‌టి, బిసిల ప్రస్తుత సంఖ్యను తెలుసుకోవాలని ముఖ్యమంత్రి ఆశిస్తున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొనే కులగణనను చేపట్టినట్టు బోధపడుతున్నది. కారణం ఏమైనప్పటికీ ఈ కార్యక్రమం శాస్త్రీయంగా జరిగి ఆయా కులాల జనసంఖ్య బహిర్గతం కావడం అవసరం. కాపు కులస్థులు రిజర్వేషన్లు కోరుతున్నారు. ఇందుకోసం ఆందోళనలు చేపట్టారు. ఈ కులంలో ఇప్పటికే రిజర్వేషన్ అనుభవిస్తున్న వర్గమూ ఉంది. ఒసి కాపుల జనాభాను గురించి రకరకాల లెక్కలు చెబుతుంటారు. వారి సంఖ్య ఎంతో తెలియవలసి ఉంది. రాజకీయాధికారం కోసం ఆరాటంలో ఈసారి ఈ వర్గం మరింత ప్రస్ఫుటంగా పోరాడాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది. వీటన్నిటికీ ఆయా కులాల జన సంఖ్యే ప్రాతిపదిక అవుతుంది. అందుచేత ఎవరు ఎంత మందో తెలియడం అవసరం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News