Sunday, December 22, 2024

గతం ఘనకీర్తి వర్తమానం అపకీర్తి

- Advertisement -
- Advertisement -

ఆంధ్ర రాజకీయాలు 2

ఆంధ్రప్రదేశ్ ఏర్పడి పుష్కర కాలం పూర్తి కాగానే, తెలంగాణలో అసంతృప్తి మొదలై అది ఆత్మాభిమాన ఉద్యమంగా ఊపందుకుంది. కోస్తాంధ్ర ప్రాంతంవారు తమ ఉద్యోగాలను ఆక్రమించారని, తమ భాషను, యాసను, ఆహారాన్ని, తమ జీవన విధానాన్ని కించపరిచారని, నీటివాటా లో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ వాసుల్లో అసంతృప్తి పెల్లుబికి జై తెలంగాణ ఉద్యమంగా రూపుదాల్చింది. చివరికది తీవ్రతరమై, హింసారూపం కూడా దాల్చింది. జై తెలంగాణ తమ ఆత్మాభిమానానికి సంకేతమని వారు భావించారు. ‘జై తెలంగాణ’ ఉద్యమం చల్లబడగానే, దానికి ప్రతిస్పందనగా కోస్తాంధ్రలో ‘జై ఆంధ్ర’ ఉద్యమం 1972లో మొదలైంది. ఈ జై ఆంధ్ర ఉద్యమంలోనే వెంకయ్యనాయుడు వంటి వారు నాయకులుగా నిలదొక్కుకున్నారు. నాయకులుగా వీరు జాతీయ స్థాయికి ఎదగడమే తప్ప, ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి పెద్దగా కృషి చేసిన దాఖలాలు ఏమీ లేవు.

ఇరవై రెండేళ్ళ క్రితం మళ్ళీ ‘ప్రత్యేక తెలంగాణ ఉద్యమం’ మొదలైంది. ‘జై తెలంగాణ’ ఉద్యమంలో లాగా ఎక్కడా హింసాత్మక సంఘటనలు జరగలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రతిగా ఆంధ్ర ప్రాంతంలో కూడా సమైక్య ఉద్యమం అంటూ ఒక ప్రాయోజిత ఉద్యమం మొదలైంది. అది ‘సభ్యత’ అనే హద్దులను దాటేసింది. ‘ప్రత్యేక తెలంగాణ ఉద్యమం’ పదేళ్ళ క్రితం ప్రత్యేక రాష్ర్ట సాధనతో ముగిసింది. తమిళుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, ఆత్మాభిమానం కోసం ఉద్యమించి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించినట్టు గానే, తెలంగాణ కూడా 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది.తెలంగాణతో ఎడబాటు వల్ల ఆంధ్ర ప్రాంత వాసులకు కొంత బాధ కలిగిన మాట వాస్తవమే. కానీ, ఒక తెలుగు రాష్ర్టం రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడినంత మాత్రాన కొంపలంటుకుపోయినట్టు గగ్గోలు పెట్టడం సరికాదు. దాన్ని ఘోరమైన నేరంగా పరిగణించకూడదు. ఒక ప్రాంతపు ఆత్మాభిమానాన్ని గౌరవించడం అనేది రాజనీతిజ్ఞత. హైదరాబాదులో పెట్టుబడులు పెట్టి, దాన్ని మేమే అభివృద్ధి చేశాం కనుక, దానిపైన రాజకీయాధికారం మాకే ఉండాలని, ఉమ్మడి రాజధానిగా ఉండాలని, ఆంధ్ర ప్రాంతంలో కొందరు నాయకులు వాదనలను తీసుకొచ్చారు.

కనీసం కేంద్ర పాలిత ప్రాంతంగానైనా చేయండంటూ కేంద్ర ప్రభుత్వానికి మహాజర్లు సమర్పించారు. ఇలా చేయడం తెలంగాణ ప్రాంత ప్రజలు చేసిన ఆత్మాభిమాన పోరాటాన్ని అవమానించడమే అవుతుంది. అసలు దక్షిణ భారతదేశానికే తలమానికం లాంటి హైదరాబాదు నగరాన్ని కేంద్రం చేతికి అప్పగించడమంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆత్మాభిమానాన్ని ఢిల్లీ పాలకులకు తాకుట్టు పెట్టి, అక్కడి పెద్దలకు దాసోహమనడమే అవుతుంది.

ప్రపంచ దేశాల్లో భారత దేశానికి ఒక ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు ఉంది. ఈ గౌరవం, గుర్తింపు తరతరాలుగా ఇక్కడి బహుళత్వం వల్లనే సిద్ధించింది. భారత దేశంలో భిన్నజాతులు, భిన్నమతాలు, భిన్న కులాల వారు తరతరాలుగా సహజీవనం సాగిస్తున్నారు. కేంద్రంలో గత పదేళ్ళుగా అధికారంలో ఉన్న బిజెపి పాలనలో ఈ బహుళత్వానికి ముప్పువాటిల్లిందని రొమిల్లా థాపర్ వంటి చరిత్ర కారులు, ఇతర మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భిన్నత్వం ఉన్న భారత దేశంలో ఒకే జాతి, ఒకే మతం, ఒకే భాష, ఒకే ఆహారం వంటి నియంతృత్వ ధోరణులను ప్రవేశపెట్టడానికి బిజెపి ప్రయత్నిస్తోంది. అందుకోసం రాజ్యాంగాన్ని కూడా సవరించాలని భావిస్తోంది. ముఖ్యంగా రాజ్యాంగంలో ఉన్న లౌకికత్వం, సామ్యవాదం అన్న పదాలను తొలగించాలని ఆ పార్టీ నేతలు ఇప్పటికే సంకేతాలు పంపుతున్నారు.

ఈ ఎన్నికల్లో బిజెపి 400 స్థానాలను గెలుచుకున్నట్టయితే రాజ్యాంగాన్నే మార్చే సే ఆలోచనలో ఆ పార్టీ ఉంది. బిజెపి పాలనలో మైనారిటీలు అభద్రతా భావానికి లోనవుతున్నారు. వారిని రెండవ శ్రేణి పౌరులుగా చేయాలని బిజెపి ప్రయత్నిస్తోంది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో శ్రీరామనవమి సందర్భంగా కాషాయ జెండాలు, కత్తు లు పుచ్చుకుని మైనారిటీ మతస్థులు నివసించే ప్రాంతా ల్లో శోభాయాత్ర పేరుతో వారిని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. వారిని అవమానిస్తూ, వారి ప్రార్థనాలయాలపైన దాడులు చేశారు. మైనారిటీలు ఆత్మరక్షణ చర్యలకు పాల్పడితే, వారిపైన కేసులుపెట్టి, వారి ఇళ్ళను బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. తమని వ్యతిరేకించే వారందరినీ ‘దేశద్రోహులు’గా ముద్రవేశారు.పోర్టులు, పరిశ్రమల వంటి దేశ సంపదను అదానీ, అంబానీలవంటి పారిశ్రామిక దిగ్గజాలకు కారుచౌకగా అప్పగించేస్తున్నారు. అనేక నిరంకుశ చట్టాలను తేవడమే కాకుండా, పాత నిరంకుశ చట్టాలకు దుమ్ము దులిపి అమలు చేస్తున్నారు.

దేశం ఇలా పదేళ్ళుగా బిజెపి పాలనను చవిచూస్తోంది. ఇలాంటి చర్యల వల్ల విదేశాల్లో ఉండే హిందువులు అభద్రతకు లోనవుతున్నారు. మెజారిటీ మతస్థుల ఆధిపత్యాన్ని అంగీకరించకపోతే మైనారిటీలు దేశం విడిచి వెళ్ళిపొమ్మనే సంకేతాలు ఆ పార్టీ నాయకుల నుంచి బాహాటంగా వినవస్తున్నాయి. దక్షిణాసియా దేశాల్లో భారత్ మినహా మిగతా అన్ని దేశాలూ మత రాజ్యాలే. ఆయా దేశాల్లో అధికార మతానికి భిన్నంగా ఏ ఒక్కటీ జరగడానికి వీలు లేదు. మతం వ్యక్తిగతం చేసిన ఒక్క భారత దేశం మాత్రమే లౌకిక రాజ్యం గా మనగలుగుతోంది. భారత దేశాన్ని కూడా మిగతా దక్షిణాసియా దేశాలవలే మతరాజ్యంగా తయారు చేస్తే ప్రపంచదేశాల్లో భారత దేశానికున్న ప్రత్యేక గౌరవం, గొప్పదనం కోల్పోతాం. భారత దేశం మళ్ళీ మత కల్లోలాలు జరిగే మధ్యయుగాల నాటికి పయనిస్తుందనడంలో సందేహం లేదు. ఉత్తర భారత దేశంలోని అనేక రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది.

గతంలో అధికారంలో ఉన్న ఏకైక కర్నాటక రాష్ర్టంలో బిజెపి గతఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. వింధ్యపర్వతాలకు దక్షిణాది రాష్ట్రాల్లో మళ్ళీ పాగా వేయాలని ఆ పార్టీ ఈ ఎన్నికల్లో విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో తాను దక్షిణాదిలో అధికారంలోకి రాకపోయినా, కనీసం తనను సమర్థించే పార్టీలకు కానీ, తనను వ్యతిరేకంచని పార్టీలకు కానీ అధికారం దక్కాలని వ్యూహాలు పన్నుతోంది. బిజెపికి అసలు బలమే లేని ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీలను సామదానభేద దండోపాయాలతో మచ్చిక చేసుకుంది. జగన్మోహన్ రెడ్డిపైన కేసులు పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలో తన ఉనికినే కోల్పోయింది.ఈ పరిస్థితిని బిజెపి తనకు అనుకూలంగా మలుచుకుని, జగన్మోహన్ రెడ్డిని తన పాలనను కాదనలేని స్థితికి తెచ్చుకుంది. జగన్మోహన్ రెడ్డి చేత చంద్రబాబు పైన కేసులు పెట్టించడం ద్వారా ఆయన్ని కూడా ఆత్మరక్షణలోకి నెట్టేసేింది.

గతంలో మోడీని దుమ్మెత్తి పోసిన చంద్రబాబును కూడా తననుకాదనలేని విధంగా మలుచుకుంది. తన వ్యూహాలను అమలు చేయడానికి జనసేనను బిజెపి పావులా ఉపయోగించుకుంది. ఈ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఢిల్లీ పాదుషా కనుసన్నల్లోకి పూర్తిగా జారిపోయిన దృశ్యం మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తోంది. మతాధిపత్యానికి, కులాధిపత్యానికి, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా అనేక సంఘ సంస్కరణలు, సారా వ్యతరేక ఉద్యమం వంటి సామాజిక ఉద్యమాలకు, రాజకీయ ఉద్యమాలకు ఊపిరి పోసిన ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఈ మూడు ప్రాంతీయ పార్టీలు ఒక మతాధిపత్య పార్టీ గొడుకు కిందకు ఈడ్చుకుపోతున్నాయి. రాష్ర్టంలో అధికారం కోసం ఈ మూడు ప్రాంతీయ పార్టీల మధ్య ఎంత పెనుగులాట ఉన్నా, కేంద్రంలో తమ పాలనపై ఏమాత్రం నోరు విప్పకుండా వారిని బిజెపి సంసిద్ధం చేసుకోగలిగింది. పార్లమెంటులో వారు చేసిన రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, మైనారిటీ వ్యతిరేక నిరంకుశ చట్టాలను ఏ మాత్రం వ్యతిరేకించనీయకుండా మలుచుకోగలిగింది.

ప్రజాభిప్రాయా న్ని కూడా కాదని ఈ నిరంకుశ చట్టాల ఆమోదానికి రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు మౌనంగా ఆమోద ముద్ర తెలిపాయి. జనసేన పార్టీ పెట్టి పదేళ్ళవుతున్నా, చట్టసభల్లో ఒక్క స్థానం కూడా సంపాదించుకోలేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి ఇక్కడ ప్రాణ ప్రతిష్ట చేయడానికి ఆ పార్టీ మంత్రాంగం నడిపి, బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీలతో ఒక కూటమిని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో ఈ ముగ్గురినీ ఎదుర్కొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం, జనసేనను విమర్శిస్తుందే తప్ప బిజెపిపైన కానీ, దాని విధానాలపైన కానీ పల్లెత్తు మాట అనడం లేదు. అంటే రాష్ర్టంలోని మూడు ప్రాంతీయ పార్టీలూ బిజెపి ఆధిపత్యానికి తలొగ్గుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలాగా బిజెపిని వ్యతిరేకించలేకపోతోంది. మూడు ప్రాంతీయ పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్‌కున్న పూర్వపు ఆత్మాభిమాన చరిత్రను ఒదిలేసి, ఆత్మన్యూనతలోకి జారిపోయేలా చేస్తున్నాయి. ఆ దిశగా రాష్ట్రాన్ని ఈడ్చుకుపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతీయ పార్టీల నాయకత్వానికి దూర దృష్టి, రాష్ర్ట భవిష్యత్తు, ప్రజల సర్వతోముఖాభివృద్ధి గురించి ఆలోచించే రాజనీతిజ్ఞత కొరవడింది.

ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వం గల రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్న రాయలసీమకు ఇవ్వవలసిన నీటి వాటాను ఇస్తూనే, ఆ ప్రాంతంతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేస్తూ, దాని ఉనికిని కాపాడాలి. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు వచ్చినంత మాత్రాన ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యలు, విభజన సమస్యలను కేంద్రం చేతికి వెళ్ళినట్టయితే రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుని, కోతి చేతికి న్యాయాధికారం అప్పగించినట్టే అవుతుంది. ఆంధ్రుల చైతన్యానికి నిజంగా ఇది అవమానకరం. చైతన్యవంతమైన ఆంధ్ర సమాజం రాజకీయంగా దారితప్పుతోంది. చైతన్యవంతమైన ఆంధ్ర సమాజం మత విద్వేషాలకు ఆలంబన కాకూడదు.

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News