Monday, December 23, 2024

చీరాలలో యువతిపై అత్యాచారం… మృతదేహాన్ని పొదల్లో పడేసి

- Advertisement -
- Advertisement -

అమరావతి: గ్రామ శివారులోకి బహిర్భూమికి వెళ్లిన యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసిన అనంతరం చంపేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా చీరాల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఈపూరుపాలెం రైల్వే సమీపంలో ఓ యువతి(21) బహిర్భూమి కోసం గ్రామ శివారులోకి వెళ్లింది. బయటకు వెళ్లిన కూతురు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు అటువైపు వెళ్లి వెతకగా పొదల్లో మృతదేహం కనిపించింది. తల్లిదండ్రులు బోరున విలపించడంతో గ్రామస్థులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి జాగిలాల సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం చేసిన తరువాత యువతిని చంపేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గ్యాంగ్ రేప్ కు పాల్పడి ఉంటారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఈ విషయం తెలిసిన వెంటనే హోంమంత్రి వంగలపూడి అనిత ఆ గ్రామానికి చేరుకొని మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. చీరాలో ప్రభుత్వాస్పత్రిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. నిందితులను త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన జరిగిన తీరు చూస్తుంటే మనం నాగరిక సమాజంలో ఉన్నామా లేక అడవుల్లో బతుకుతున్నామా? అనిపిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబాన్ని ఓదార్చి రావాలని చెప్పారన్నారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్పందించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు స్థానిక ఎంఎల్‌ఎ ఎంఎం కొండయ్య పది లక్షల రూపాయల చెక్కును మృతురాలి కుటుంబానికి అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News