గ్రహ శకలం కనుగొన్న విద్యార్థిని
నిడదవోలు: తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలుకి చెందిన పదో తరగతి విద్యార్థి కుంచాల కైవల్యరెడ్డి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న ముఖ్యమైన ఆ్రస్టాయిడ్ బెల్ట్‌లో గ్రహ శకలం 2021 సీఎం37ను కనుగొన్నది. నాసా భాగస్వామ్య సంస్థ అయిన అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబిరేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన క్యాంపెయిన్‌లో ఈ గ్రహశకలాన్ని కనిపెట్టింది. ఈ మేరకు అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబిరేషన్ సంబంధిత ధ్రువీకరణపత్రాన్ని కైవల్యకు అందజేసింది.
పాన్‌స్టార్స్ టెలిస్కోప్ సాయంతో తీసిన అంతరిక్ష ఛాయా చిత్రాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి విశ్లేషించడం ద్వారా ఈ గ్రహశకలాన్ని గుర్తించినట్లు కైవల్య తెలిపింది. ఢిల్లీకి చెందిన స్వచ్ఛంధ సంస్థ స్పేస్‌పోర్ట్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు సమీర్ సత్యదేవ్ వద్ద కైవల్యరెడ్డి శిక్షణ తీసుకుని ‘గామా’ టీం పేరుతో శకలాన్ని గుర్తించింది. గతంలో కైవల్య 2020 పీఎస్ 24 అనే మెయిన్ బెల్ట్‌లో ఉన్న గ్రహశకలాన్ని కనుగొనడంతో సీఎం వైఎస్ జగన్ ఆమెను అభినందిస్తూ రూ.లక్ష నగదు బహుమతి అందజేసి ప్రోత్సహించారు. రెండో గ్రహశకలం కనుగొన్న కైవల్యని తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి అభినందించారు.