Thursday, January 23, 2025

అంగన్‌వాడి వ్యవస్థపై కేంద్రం చిన్నచూపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌషికాహారాన్ని అందించి ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించే అంగన్‌వాడి వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష వైఖరిని ప్రదర్శిస్తోంది. గర్భిణీలు , బాలింతలు, 6 ఏళ్ళ లోపు చిన్నారులకు సప్లిమెంటరీ న్యూట్రీషన్, ఇమ్యునైజేషన్, ఎప్పటికప్పుడు అరోరగ్య పరీక్షలు నిర్వహిస్తూ, ఆరేళ్ళ లోపు చిన్నారులకు ప్రి ఎడ్యుకేషన్‌ను అందించే అంగన్‌వాడి కేంద్రాలను మరింత పటిష్ట పరుచడంలో కేంద్రం చేతులెత్తేసింది. ఇది పేరుకు కేంద్ర ప్రభుత్వ పథకమైనా భారం మాత్రం దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 31,711 అంగన్‌వాడి కేంద్రాలు, 3,989 మిని అంగన్‌వాడిలు మొత్తం 35,700 అంగన్‌వాడి కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటి పూర్తి భారం దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన పరిస్థితి నెలకొంది.

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడే అంగన్‌వాడి కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శమైన కేంద్రాలుగా తీర్చిదిద్దింది. ఇందుకు కేంద్ర సహకారం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే నిధులను వెచ్చిస్తోంది. అంగన్‌వాడి టీచర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని తెలంగాణ ప్రభుత్వం భారీగా పెంచి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అంగన్‌వాడి టీచర్లకు రూ. 4,200, మిని అంగన్‌వాడి టీచర్లకు రూ. 2,200 , హెల్పర్లకు రూ. 2,200 గౌరవ వేతనం ఉంటే కేంద్రం తన వాటా గా అంగన్ వాడి టీచర్లకు రూ.2,700, మిని అంగన్ వాడిలకు రూ. 2,025, హెల్పర్లకు రూ. 1,350 చెల్లించేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారిగా 2015 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడి టీచర్ల గౌరవ వేతనాన్ని రూ.7,000లకు, 2017లో రూ.10,500కు, 2021లో రూ.13,650కి పెంచింది. అయితే ఇప్పటికీ కేంద్ర వాటా రూ. 2,700 మాత్రమే ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం రూ. 10,950 చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం భరిస్తుంటే కేంద్రం కేవలం 20 శాతం మాత్రమే భరిస్తోంది. మినీ అంగన్ వాడి టీచర్లకు గౌరవ వేతనం 2014లో రూ. 2,200 ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో రూ.4500 లకు, 2017లో రూ. 6,000లకు, 2021లో రూ.7,800 లకు పెంచారు. ఇందులోనూ కేంద్ర వాట రూ. 2,025 నుంచి రూ. 2,100 కు పెంచారు. అంటే కేంద్రం రూ. 75 మాత్రమే పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,600 లు పెంచింది. మిని అంగన్ వాడిల వేతనంలో కేంద్రం రూ.2100 చెల్లిస్తుంటే రాష్ట్రం రూ.5,775లు చెల్లిస్తోంది. హెల్పర్లకు గౌరవ వేతనం రూ. 2200 నుంచి 7,800 లకు పెంచారు. ఇందులో కేంద్రం రూ. 1350 భరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.6,450 భరిస్తోంది.
అంగన్‌వాడిలలో కిచెన్ గార్డెన్
గర్భిణీలు, ఆరేళ్ళలోపు పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడి కేంద్రాల్లో కిచెన్ గార్డెన్‌ను ప్రవేశ పెట్టింది. ముఖ్యంగా సేంద్రీయ విధానంలో ఆకుకూరలు పెంచి వాటిని ఆహారంగా అందిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో తొట్టెల్లో ఆకుకూరలను పెంచుతున్నారు. ప్రతి అంగన్ వాడి కేంద్రంలో దీనిని తప్పని సరి చేశారు. గర్భిణీలు, పిల్లల్లో ఐరన్ లోపం ఎక్కువగా ఉండడంతో మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు సప్లిమెంటరీ న్యూట్రీషన్ అందించేందుకు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారు. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50 ః50 నిష్పత్తిలో నిధులు సమకూర్చుతున్నాయి. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బాలామృతం పథకాన్ని అమలు చేస్తోంది. ఇందుకు 100 శాతం రాష్ట్ర ప్రభుత్వమే నిదులు సమకూర్చుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News