కొత్తగూడెం : అంగన్‌వాడీ సిబ్బందిని బిఎల్‌వో విధుల నుంచి మినహాయించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కంచర్ల జమలయ్య డిమాండ్ చేశారు. బిఎల్‌వో విధులకు సంబంధించి బకాయి అలవెన్సులు, వేతనాలు చెలించాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి అనుబంధ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదనపు విధులతో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందని, కేంద్రాల ఏర్పాటు లక్షం నీరుగారి పోతోందని అన్నారు.
టీచర్లకు, బిఎల్‌వోలకు విధులు కేటాయించి ఐదేళ్లపాటు ఊడిగం చేయించుకుని కేవలం 2021కి సంబంధించి రూ.4500లు చెల్లించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. నాలుగు సంవత్సరాలకు సంబంధించిన వేతనాలు విడుదల శ్రమను దోచుకున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో బిఎల్‌వో విధులు నిర్వహిస్తున్న టీచర్లకు ఏడాదికి రూ. 6 వేల గౌరవ వేతనం ఇంటింటి సర్వేకు వెయ్యి, టిఎడిఎ బిల్లుతో పాటు పార్లమెంట్,అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేసినందుకు రూ.1150లు చెల్లించాలని నిబంధన ఉన్నప్పటికీ చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు.
వారికి సంబంధించి గరుడ యాప్ వినియోగానికి స్మార్ట్‌ఫోన్, సిమ్, నెట్ ఛార్జీలు అతీగతీ లేకుండా పోయాయన్నారు. తక్షణమే బిఎల్‌వోకు చెల్లించాల్సిన బకాయి వేతనాలు , బిల్లులు విడుదల చేయాలని , కేంద్రాల నిర్వహణకు ఆటంకంగా మారిన బిఎల్‌వో విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా నాయకులు గోనె మణి, రూపా, ప్రమీల, సరోజ, ప్రతిభ,భాగ్య, మంగతాయి తదితరులు పాల్గొన్నారు.