మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్‌ని పర్మినెంట్ చేయాలని, కనీస వేతనాలు రూ. 26 వేలు ఇవ్వాలని, అదనపు పని భారాన్ని తగ్గించాలనే తదితర డిమాండ్లతో సెప్టెంబర్ 11 నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మెపై జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా సంక్షేమాధికారినిలకు సోమవారం సిఐటియు, ఎఐటియుసిల ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు అందించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల మంది అంగన్‌వాడీ టీచర్స్, అయాలు తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి నిరవధిక సమ్మెలోకి వెల్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారిని హైమావతి, జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారికి సమ్మె నోటీసులు అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు, ఎఐటియుసిల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో అందించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ సిఐటియు, ఎఐటియుసి జిల్లా కార్యదర్శులు స్నేహబింధు ఎల్. ఆర్. ఈశ్వరిలు మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్స్, హెల్పర్స్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్షంగా వ్యవహరిస్తోందన్నారు. పని భారాన్ని పెంచుతూ కనీసం వేతనం, ఈఎస్‌ఐ, పీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని పదే పదే ప్రభుత్వాన్ని కోరుతూ వినతిపత్రాలు ఇచ్చినా, దశలవారీగా ఆందోళనలు నిర్వహించినా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదని ఆరోపించారు.
పశ్చిమ బెంగల్, అస్సాం, కర్ణాటక రాష్ట్రాల్లో తాము అడుగుతున్న డిమాండ్లన్నింటినీ కొనసాగిస్తున్నాయన్నారు. గుజరాత్‌లో సుప్రీం కోర్టు చెప్పినట్లు గ్రాట్యుటీ చట్టం అమలు జరుగుతున్నా ఏ సౌకర్యాలు అమలు చేయడం లేదన్నారు. అంగన్‌వాడీల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అద్యక్షులు ఆకుల రాజు, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి రేషపల్లి నవీన్, అంగన్వాడీ నాయకురాళ్లు బానోత్ సరోజ, తిరుపతమ్మ, చిర్రా లక్ష్మీనరసమ్మ, రజియా, భానుమతి తదితరులు పాల్గొన్నారు.