Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో అంగన్‌వాడి టీచర్ మృతి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఛలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరి రోడ్డు ప్రమాదంలో మరణించిన అంగన్‌వాడీ టీచర్ మంగ కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని అంగన్ వాడీ టీచర్స్, అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రాజెక్టు ఇబ్రహీంపట్నం మండలంలోని అచ్చక్కపేట గ్రామానికి చెందిన అంగన్‌వాడి టీచర్ మంగ ఈ నెల 28న జరుగనున్న చలో పార్లమెంటు కార్యక్రమానికి బయలుదేరి సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల అసోసియేషన్ నాయకులు ప్రేంపావని, నండూరి కరుణ కుమారి, ఎం.సాయీశ్వరి, సిహెచ్ సీతామహాలక్ష్మి, ప్యారీజాన్‌లు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

ఆమె మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. గత మూడు దశాబ్దాలకు పైగా ఐసిడిఎస్‌లో పని చేస్తున్న మంగ ఎంతో నిబద్దతతో , అంకిత భావంతో అంగన్‌వాడి కేంద్రంలోని పిల్లలకు, తల్లులకు తమ సేవలందిస్తూ ఎంతో ఆదరాభిమానాలు సంపాదించుకుందని తెలిపారు. అంగన్‌వాడి సమస్యలపై జరిగే ఉద్యమాలు, పోరాటాల్లో ఎంతో క్రియాశీలకంగా పాల్గొనే మంగ ఆకస్మిక మరణం అంగన్‌వాడి ఉద్యమానికి , ఆమె కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. మంగ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, ఆమె కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News