Friday, December 20, 2024

అంగన్‌వాడీ టీచర్లు సమ్మె విరమించాలి

- Advertisement -
- Advertisement -

న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
ఆందోళనతో గర్భిణీలు, చిన్నారులకు ఇబ్బందులు: మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్:  రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లు వెంటనే సమ్మె విరమించాలని న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. శుక్రవారం వెంగల్‌రావులోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన తరువాత సమ్మె చేయడం సరికాదని సమాజంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఎక్కువమంది బలహీన వర్గాల వారే ఉన్నారని వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని అంగన్‌వాడీల సర్వీస్‌ను కొనసాగించాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగన్‌వాడీలకు రాష్ట్రంలో అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని కొందరు ఉద్దేపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసమే అంగన్‌వాడీలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. అంగన్‌వాడీలు వాస్తవాలను గ్రహించి వెంటనే విధులకు హాజరుకావాలని, టీచర్లు, ఆయాల వేతనాలను గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు.

వారిని రెగ్యులర్ చేయాలన్న డిమాండ్ కేంద్ర పరిధిలోని అంశమని,  కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడం కష్టమమన్నారు. కేంద్ర ప్రభుత్వనికి అంగన్ వాడీల తరుపున లేఖ రాస్తామని అవసరమైతే మేము స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి సమస్యలు వివరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పిఆర్‌సి అమలు చేస్తున్నట్లు ప్రతి నెల 14వ తేదీ వరకు జీతాలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఇచ్చే జీతాలు ఇవ్వడం లేదని సమ్మె బాటలో సమస్యలు పరిష్కారం దొరకదని వినతిపత్రం ద్వారా సమస్యలను సిఎం కెసిఆర్ పరిష్కరిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అన్ని డిమాండ్లను నెరవేర్చినట్లు అంగన్‌వాడీలకు మూడుసార్లు గౌరవ వేతనాలు పెంచినట్లు దేశంలో ఎక్కడా లేనివిధంగా టీచర్లకు రాష్ట్రంలో రూ. 13,650 వేతనాలు అందిస్తుందన్నారు.

ఇతర రాష్ట్రాలు కనీస వేతనాలు ఇవ్వడం లేదని మహారాష్ట్రలో రూ. 6,500, రాజస్థాన్‌లో రూ. 6230, గుజరాత్ లో రూ. 7,800, వెస్ట్ బెంగాల్ రూ. 8,250, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 11,500 మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. టీచర్లకు రాష్ట్రంలో 50 సంవత్సరాలు వారికి 2 లక్షల జీవిత బీమా 50 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు 2 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తూ జీవో జారీ చేశామన్నారు. అంగన్‌వాడీల పని భారం తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని భవనాల అద్దెను పెంచామన్నారు. టీచర్ల వేతనాలు 2014లో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 1500 ఉంటే ప్రస్తుతం రూ. 10,950 పెంచినట్లు కేంద్రం వాట ఒక్క రూపాయి కూడా పెంచలేదని మండిపడ్డారు. ఉద్యోగ విరమణ వయసు 65 సంవత్సరాలు చేస్తూ, టీచర్లకు లక్ష రూపాయలు, ఆయాలకు రూ. 50 వేలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని 3,989 మిని అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలుగా మారుస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 56 కోట్ల ఖర్చు భరిస్తుందని వెల్లడించారు. ఈ సమావేశంలో మహిళల అభివృద్ధి సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోలికేరి, జేడీ లక్ష్మీ దేవీ,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News