Monday, December 23, 2024

సీనియర్లపై చిర్రుబుర్రు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. సీనియర్ల మద్య విభేదాలు పార్టీకి ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో వీటిని చక్కదిద్దేందుకు ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపా ల్ రంగంలోకి దిగారు. శనివారం హైదరాబాద్ వచ్చిన ఆయన సీనియర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన సీనియర్ నాయకులను తీవ్రంగా మందలిస్తూ క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. సీనియర్ నేతలు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకోకుండా, సమష్టిగా కలిసికట్టుగా పనిచేయాలని హితవు పలికినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

కెసి వేణుగోపాల్ సమక్షంలోనే మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్పచారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు సీనియర్ నేతలు తనను టార్గెట్ చేశారని కెసి వేణుగోపాల్‌కు ఫిర్యాదు తెలిసింది. మండల కమిటీలపైనా వేణుగోపాల్ సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియ ర్ నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగినట్లు తెలిసింది. దాదాపు అరగంట సేపు నేతల మధ్య పరస్పర నిందారోపణలు, దూషణలు జరిగాయని తెలిసింది. దీంతో పరిస్థితిని అదుపుచేసేందుకు కెసి వేణుగోపాల్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గొడవ సద్దుమణిగిన అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులకు రానున్న నెల రోజుల పాటు చేయాల్సిన కార్యక్రమాలను వివరించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వీలుగా సీనియర్ నాయకులు జిల్లాల్లో , గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో పర్యటించాలని, గిరిజనుల గూడెల్లో రాత్రుళ్లు బస చేయాలని కూడా వేణుగోపాల్ సీనియర్ నేతలను ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి కెసి వేణుగోపాల్ పలు సూచనలు చేసారని పిఎసి కన్వీనర్ షబ్బీర్ అలీ తెలిపారు. ట్రైబల్ డే రోజు తండాలలో బస చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కర్ణాటక తరహా ప్రచారం వ్యూహం అవలంభించాలని కెసి వేణుగోపాల్ సూచించినట్లు తెలిపారు. రాష్ట్రంలో భూముల కుంభకోణం జరుగుతోందని దీని పై ఛార్జిషీట్ వేయాలని నిర్ణయించారు. ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్15 లోపు రాష్ట్రంలో నాలుగు బహిరంగ సభలు నిర్వహించాలని ముఖ్యంగా జహీరాబాద్, మహాబూబ్ నగర్ ,నల్లగొండ పార్లమెంట్ పరిధిలలో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఒక్కో బహిరంగ సభకు జాతీయ స్థాయి నుండి ఒక్కో ముఖ్య నేత వస్తారని తెలిపారు. కాగా హైదరాబాద్ చేరుకున్న కెసి వేణుగోపాల్‌కు అంతకు ముందు టిపిసిసి అధ్యక్షులు ఎంపి రేవంత్ రెడ్డి, ఎఐసిసి ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి, ప్రోటోకాల్. ఇంచార్జ్ హర్కర వేణుగోపాల్ తదితరులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఘనంగా స్వాగతం పలికారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News