Monday, January 20, 2025

జలనిధి మీద జాలర్ల బతుకు వేట

- Advertisement -
- Advertisement -

చింతామణి వంటి పత్రికలు, ఆంధ్ర విశ్వవిద్యాల యం వంటి సంస్థలు ఒకప్పుడు నవలా పోటీలు ని ర్వహించి తెలుగు నవలా వికాసానికి తోడ్పాటునందిస్తే, ప్రస్తుతం విదేశాలలో ఉన్న తెలుగువారు తెలుగు సా హిత్యం పై అభిమానంతో తానా, ఆటా సంస్థల ద్వారా న వలా పోటీలను నిర్వహించి వర్తమాన సమాజంలో నవలా వికాసానికి చేయూతనందిస్తున్నారు. ఈమధ్య అన్వీక్షకి అనే ప్రచురణ సంస్థ కూడా నవల పోటీలను నిర్వహించడానికి సంసిద్ధమవడం నిజంగా చాలా ఆనందించ దగ్గ విషయం. ఈ క్రమంలో 2021 లో తానా నిర్వహించిన నవలా పోటీలలో అనేక వడపోతలకు గురై, చివరకు విజేతగా నిలిచి బహుమతి అందుకున్న నవల మున్నీటి గీతలు.

ఈ మున్నీటి గీతలు ఉత్తరాంధ్ర ప్రాంతపు వలస జాలర్ల కథ. భారతదేశంలో 975 కిలోమీటర్లు తీర ప్రాంతం కలిగిన రెండో అతిపెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందులో 353 కిలోమీటర్ల సముద్ర తీరం ఉత్తరాంధ్ర సొంతం. ఈ తీర ప్రాంతాన్ని ఆనుకుని జీవిస్తున్న మత్స్యకారుల సమస్యలు సాహిత్యంలో వస్తువుగా ఇంతవరకు రాలే దు. ఉణుదుర్తి సుధాకర్ గారి యారాడ కొండ నవల విశాఖపట్నం జాలరుల జీవితాన్ని ప్రాథమికంగా కొంత తడిమింది. పూర్తిస్థాయి జాలరుల జీవితం ఇంకా ఈ ప్రాంత సాహిత్యంలో కొరత గానే ఉన్న సమయంలో చేపలు తినని ఇంట పుట్టి, పెరిగిన చింతకింది శ్రీనివాస రావు ఇక్కడి జాలర్లు పక్కనే ఉన్న ఇంత పెద్ద బంగాళాఖాతం విడిచిపెట్టి, ఎక్కడో ఉన్న అరేబియా సముద్రానికి చేపలు పట్టడానికి ఎందుకు వలస వెళ్తున్నారు? అనే ప్రశ్న వేసుకుని, పరిశీలించి, పరిశోధించి జవాబులతో సహా వారి జీవితాన్ని ’మున్నీటి గీతలు’ నవలగా మనకు అందించారు.

చింతకింది దాదాపు 32 ఏళ్ల పాటు పత్రికా రంగంలో పనిచేసారు. ఉడుకు బెల్లం, కాన్పుల దిబ్బ మొదలగు కథా సంపుటాలను వెలువరించి, చాసోస్ఫూర్తి మొదలగు అవార్డులను సంపాదించుకొని సాహిత్య లోకంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మున్నీరు అంటే సముద్రం. మనుషులు తమ స్వార్థంతో వర్ణ, వర్గ, కుల, మత, జాతుల బేధాలతో విడిపోవడమే కాకుండా తమకు ఫలాలను ఇస్తున్న పంచభూతాలను కూడా గీతలు గీసి విభాగిస్తున్నారు. ఆ గీతలను చూపించి పాలకులు తమ అహంకారపు ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటుంటే, ఆకలి కోసం ఆ గీతలను దాటినవారు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు.

‘మనిషి మేధస్సు గీతలు గీయడానికి కాదు, గీతలు చెరపడానికి పనికి రావాలి‘ అనే విశ్వ మానవ సందేశాన్ని ముగింపుగా, శ్రీకాకుళం జిల్లా, మత్స్యవేనం గ్రామ జాలర్ల వలస జీవితాన్ని చిత్రించింది ఈ నవల.
శ్రీకాకుళ సాంస్కృతిక వారసత్వం జముకు పాటతో నవలను ప్రారంభిస్తాడు రచయిత. అయితే ఏది నిజమైన కళ అనే చర్చను లేవదీసి జీవితాన్ని గానం చేసేదే నిజమైన కళ అని తీర్పునిచ్చి కథలోకి దూకుతాడు రచయిత. శ్రావణమాసంలో మొదలయ్యే వేట కోసం కావలసిన జాలర్లను( పడవ నడిపే వారిని తాండేళ్లు అని, వలవేసి చేపలు పట్టే వారిని కళాసిలు అని పిలుస్తారు) జ్యేష్ఠ మాసంలోనే గుజరాత్ నుంచి వచ్చిన సేట్లు, ఊర్లకు ఊర్లుగా గుంప గుత్తగా మాట్లాడుకుని బయానాలు ఇచ్చి వెళుతుంటారు. అయితే కూలి రేట్లు తమ అదుపులోనే ఉండేటట్టుగా ఊర్లో ఒకరిద్దరిని తమ వైపే ఉండేటట్టు చేసుకుంటారు. శ్రావణంలో వేటకు బయలు దేరడానికి సిద్ధమవుతున్న జాలర్లు తమ కందిన అడ్వాన్సులతో చేసిన అప్పులు తీర్చి, ఆషాడంలో గంగానమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు.

ఈ క్రమంలో మత్స్య భైరవదాసు లాంటివారు ఈ మత్స్యకారులకు నెత్తి మీద దేవతలు లాంటి వారని, దాసుల్ని కొలవడం, ప్రశ్న వేయడంలాంటి వారిలో అక్కడక్కడ ఉన్న మూఢాచారాలను వర్ణిస్తాడు రచయిత. తదుపరి పూరి- ఓకా రైలు ఆమదాలవలస నుండి సౌరాష్ట్రలోని రాజ్కోటకు రెండు రాత్రులు, రెండు పగళ్ళుకు లాక్కుపోతుంది ఈ వలస జాలరులను. ఆ రైలు ప్రయాణాన్ని ఉత్సాహంగా వివరిస్తాడు రచయిత. ఇందులో కుంచడి ద్వారా మంచి హాస్యాన్ని పండిస్తూ, వారికి రైలు ప్రయాణాన్ని, మనకు కథా ప్రయాణాన్ని నడిపిస్తాడు రచయిత. గుజరాత్ లో వెరావెల్ లో దిగిన తర్వాత, కొండబాబు తాండేలుగా, పోలడు, కుంచడు, వెంకటి మొదలగువారు కళాసీలుగా ఓంకార్ పడవ మీద వేటకు బయలుదేరుతారు. ఆ పడవ నిర్మాణాన్ని వర్ణించడమే కాకుండా, పడవ వెళుతున్న కొలది సముద్రంలోని నీటి రంగులను కూడా, మనకు దృశ్యమానం చేస్తాడు రచయిత.

సముద్రం మధ్యలోపడవ నిలబెట్టే విధానం, చేపల కోసం వలవిసిరే విధానం, వాటిని లాగే విధానం, పడవలోకి వచ్చే చేపల పోగును ఐస్ పెట్టెలలో సర్దించడం చెబుతూనే, సముద్రంలో తాము చేయబోయే 20 రోజుల వేటలో తమ పరిమితి మేరకు చేపలు పట్టాలనే తాపత్రయంతో ముందు ముందుకు వెళ్లిపోయి, పాకిస్తాన్ జలాలలోకి చేరిపోవడం, ఆ దేశపు రక్షణ విభాగానికి చిక్కిపోయి, జైళ్లకు తరలించబడడం, అక్కడి వారి అవస్థలు, ఇది క్రమంగా కథ. అయితే ఇది సమిష్టి కథ. అయితే ఆదర్శ భావాలు ఉన్న పోలా రావు అనే యువకుడిని, కథానాయకుడిగా చేసి కథను నడిపిస్తాడు. కొద్దిపాటి చదువుకున్న మత్స్యకారుడిలో ఆదర్శభావాలు ఉండడానికి తనొక నిర్వచనం ఇచ్చుకున్నాడు. ‘ మనుషుల గొప్పతనం అదేనేమో. లౌకిక ప్రపంచాన స్వార్థపూరితమై, అసూయ గ్రస్తమై, తామస సంహితమై నడయాడినా, ఎప్పుడో, ఎక్కడో ఒక అలౌకిక అనుభూతికి లోనైన వేళ ఈ లక్షణాలన్నింటినీ పూర్ణంగా వదిలి పెట్టేస్తారేమో.

శ్రేష్ట మానవులుగా మిగిలిపోతారేమో. విశుద్ధ వ్యక్తిత్వంతో విరాజిల్లుతారేమో. కొన్ని క్షణాలైనా ఆ రకమైన వర్తనతో నిసర్గ సుందరమై జీవిస్తారేమో. పునీతమవుతారేమో. ఆ క్షణాలు క్షణాలుగా మలిగిపోకుండా నిమిషాలుగా మారి, గంటలై, రోజులై, సంవత్సరాలై ఒక వ్యక్తి జీవిత కాలమంతా వ్యాప్తమైతే అలాంటి వాళ్లే మహాత్ములవుతారు. వాళ్లే రేపటి రోజున వికాసపు ఉదయ సిరులను వెదజల్లుతారు.‘ ఇందులో పోలారావు తన వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉదాహరణకు తల్లిదండ్రులు చివరి దశలో ఉండేటప్పుడు లేమితనం ఇబ్బంది పెట్టినా, ఆస్తులను వదిలేయడానికి సిద్ధపడతాడు. అలాగే పాకిస్తాన్ జైల్లో ఉండేటప్పుడు జైలు అధికారి వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని శారీరకంగా హింసించినా, జైలు అధికారి భార్యకు అవసరమైనప్పుడు రక్తాన్ని అందిస్తాడు. తనను ప్రేమించిన అమ్మాయి తండ్రి తనను హేళన చేసినప్పటికీ తిరిగి అతని గౌరవాన్ని కాపాడ్డానికి ప్రయత్నం చేస్తాడు. ఇలా ఏ సందర్భంలో కూడా లౌకికమైన స్వార్థానికిలొంగిపోకుండా ఉంటాడు.

పోలరావు మేనత్త కూతురు ఎర్రమ్మ, పోలరావును ఇష్టపడుతుంది. దానికి ఆమె తల్లి పోలీసమ్మ కూడా అంగీకరిస్తుంది. కానీ ఎర్రమ్మ తండ్రి భవిరోడు అంగీకరించడు. చివరికి పాకిస్తాన్ జైల్లో కలిసి ఉండేటప్పుడు పోలడి ప్రవర్తన అతడిని మారుస్తుంది. దీన్ని కేంద్ర కథగా మార్చి, మత్స్యకారుల జీవన విధానం, వారి ఆచారాలు అలవోకగా మనం ముందు పెడతాడు రచయిత.
52వ పుటలో సముద్రంలో దొరికే చేపల రకాలను చెప్పి మనకు నోరూరింపు చేస్తాడు. తూర్పు తీర కెరటాలకు కరెంటు ఎక్కువ అని, దానికి కుట్టుడు పడవలు తట్టుకోలేక విరిగిపోవడం, నాదరి జాలర్ల శరీరాలు చిధ్రం కావడం. గుజరాత్లో ప్రతి పాతిక కిలోమీటర్లకు ఒక జెట్టి, ఫిషింగ్ హార్బర్ ఉండగా, మన ఉత్తరాంధ్రలో విశాఖపట్నం తప్పితే కాకినాడలో మాత్రమే ఫిషింగ్ హార్బర్లు ఉండడం మన పాలకులు ఎంతసేపు జాలర్లను ఓటు బ్యాంకుగా చూడడమే కనిపిస్తుంది, కానీ వారికి ఏం కావాలో తెలుసుకోలేక పోతుంది అన్న సత్యాన్ని నవల వివరిస్తుంది.

అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెలసిన ఫ్యాక్టరీలు తమ వ్యర్ధపదార్థాలను సముద్రంలోనికి కలపడం ద్వారా, సముద్రపు నీరు విషతుల్యమై చేపలు పెరగ లేని వైనాన్ని నవల చర్చించింది. ఇలా ఈ చిన్న 210 పుటల నవల కష్టాల్లో జన్మించి, కల్లోలాల్లో జీవించి, కడగండ్లలోనే కడతేరిపోతున్న వలస జాల ర్ల ఉనికిని విపులంగా చెప్పిందనడములో సందేహం లేదు.
తామరను గోకితే వచ్చేటంత తిమారింపు, గజ్జిని తాకితే వచ్చేటంత జుటాయింపు, ఎచ్చెర్లోడికి ఎత్తులు మప్పగల్దుమా, పీనుగు పెళ్లికి పిత్తే మంత్రం మొదలగు సామెతలతో, పాత్రల సంభాషణలలో మాండలిక భాషను ఉపయోగించినప్పటికీ నవలంతా శ్లిష్ట వ్యవహారికంలో నడిచింది. సాహిత్యంలో ఇంతవరకు పూర్తిస్థాయి వస్తువుగా నోచుకోని ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితాన్ని నవలగా చిత్రించిన చింతకింది శ్రీనివాస రావు గారు నిజంగా అభినందనీయులు.

డాక్టర్. ఆల్తి మోహన రావు
9963895636

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News