Monday, December 23, 2024

“భారతీయుడి”కి కోపం వచ్చింది: ఆడపిల్లలు స్మోకింగ్ చేస్తున్నారని…

- Advertisement -
- Advertisement -

ఇండోర్: అమ్మాయిలు ధూమపానం చేస్తున్నారన్న కోపంతో ఒక 70 ఏళ్ల వృద్ధుడు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఉన్న ఒక కేఫ్‌ను తగటబెట్టాడు. మంగళవారం రాత్రి కేఫ్ మూసి ఉన్న సమయంలో ఆ వృద్ధుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అదనపు పోలీసు డిప్యుటీ కమిషనర్ రాజేష్ దండోరియా బుధవారం తెలిపారు. సిసిటివి ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు ఆయన చెప్పారు.

నిందితుడు టెలికమ్యూనికేషన్స్ శాఖలో పనిచేసి రిటైరయ్యాడని ఆయన చెప్పారు. అమ్మాయిలు కేఫ్‌లో కూర్చుని స్మోకింగ్ చేయడం తనకు నచ్చలేదని, అందుకే కేఫ్‌కు నిప్పు పెట్టానని నిందితుడు ప్రాథమిక విచారణలో వెల్లడించినట్లు అధికారి చెప్పారు. అయితే నిందితుడు తన వాంగ్మూలాన్ని పదేపదే మారుస్తున్నాడని, దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు వాస్తవం బయటకు వస్తుందని ఆయన తెలిపారు.

దసూదియా పోలీసు స్టేషన్ పరిధిలో ఉండే ఈ కేఫ్ ఆ సీనియర్ సిటిజన్ అంటించిన నిప్పుకు పూర్తిగా దగ్ధమైంది. ఈ దహనకాండ కారణంగా కేఫ్ యజమానికి రూ. 4 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు దండోరియా తెలిపారు. ఐపిసిలోని సెక్షన్ 436 కింద నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నిందితుడు గత కొద్ది రోజులుగా తన కేఫ్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడని కేఫ్ యజమాని పోలీసులకు తెలియచేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News