యాంగూన్ : మయన్మార్‌లో తీవ్ర నిరసనలు కొనసాగుతున్నప్పటికీ మిలిటరీ పాలకులు మాత్రం అంగసాన్ సూకీ నిర్బంధాన్ని ఈనెల 17 వరకు పొడిగించారు. సోమవారంతో సూకీ నిర్బంధం గడువు పూర్తి అయినప్పటికీ సూకీ విడుదల ప్రధాన డిమాండ్‌గా నిరసనలు హోరెత్తుతున్నాయి. మిలిటరీకి, ఆందోళన కారులకు మధ్య ఉద్రిక్తతలు తీవ్రమౌతున్నందున సూకీ నిర్బంధాన్ని పొడిగించారని సూకీ తరఫు న్యాయవాది ఖిన్ మౌంగ్ జా చెప్పారు. సోమవారం మయన్మార్ దేశమంతా ఆందోళనలు కొనసాగాయి. దేశంలో రెండో ప్రధాన నగరమైన మాండలేలో వేలాది మంది ఇంజినీర్లు తమ నేతను విడిచిపెట్టాలి…న్యాయం కోసం ఎవరు నిలబడతారు ? ..అర్దరాత్రిని అర్థాంతరంగా, అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆపాలి … అంటూ నినాదాలు చేశారు.
యాంగూన్ నగరంలో సోమవారం కొంతమంది ఆందోళనకారులు గుమికూడారు. మయన్మార్ లోని సెంట్రల్ బ్యాంకు భవనం వద్ద వందలాది మంది ఆందోళన కారులు నిరసన ప్రదర్శన చేశారు. అక్కడ మిలిటరీ దళాలతో ట్రక్కులు పహరా కాస్తున్నాయి. సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని, సేవ్ మయన్మార్ అంటూ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. రవాణా కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖ నుంచి ఆదివారం ఒక ఉత్తర్వువెలువడింది. మొబైల్ సర్వీస్ ఉన్నవారు తమ ఇంటర్నెట్ కనెక్షన్లను ఆదివారం రాత్రి 1 గంట నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు ఆపివేయాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.