ముంబయి: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను ఈనెల 6వ తేదీ వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) కస్టడీకి అప్పగిస్తూ ముంబయి ప్రత్యేక సెలవు కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర పోలీసు విభాగంలో బెదిరింపు వసూళ్ల వ్యవహారానికి సంబంధించిన కేసులో 12 గంటలపాటు దేశ్‌ముఖ్‌ను ప్రశ్నించిన ఈడి అధికారులు సోమవారం రాత్రి ఆయనను అరెస్టు చేశారు. మంగళవారం ఆయనను అదనపు సెషన్స్ జడ్జి పిబి జాదవ్ ఎదుట హాజరుపరచగా ఈనెల 6 వరకు ఆయనను ఈడి కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.
కోర్టులో హాజరుపరచడానికి ముందు ఎన్‌సిపి నాయకుడైన దేశ్‌ముఖ్‌ను ఈడి అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం జెజె ఆసుపత్రికి తీసుకెళ్లారు. అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోఓపణలపై ఈ ఏడాది ఏప్రిల్ 21న దేశ్‌ముఖ్‌పై సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా ఆయనతోపాటు ఆయన సహచరులపై ఈడి దర్యాప్తు ప్రారంభించింది. రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న కాలంలో దేశ్‌ముఖ్ అధికార దుర్వినియోగానికి పాల్పడడంతోపాటు బర్తరఫ్‌కు గురైన పోలీసు ఉన్నతాధికారి సచిన్ వాజే ద్వారా ముంబయిలోని వివిధ బార్లు, రెస్టారెంట్ల నుంచి రూ. 4.70 కోట్లు వసూలు చేసినట్లు ఈడి కేసు నమోదుచేసింది.