ముంబయి: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్‌సిపి నేత అనిల్‌దేశ్‌ముఖ్ మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)ముందు హాజరు కావడానికి నిరాకరించారు. మనీ లాండరింగ్(నగదు అక్రమ తరలింపు) కేసులో అనిల్‌దేశ్‌ముఖ్‌పై ఇడి దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇడి ముందు హాజరు కాకుండా ఉండటం అనిల్‌కిది ఐదోసారి. తాను హాజరు కాకుండా న్యాయపరమైన అవకాశాల్ని వినియోగించుకుంటానంటూ తన న్యాయవాది ద్వారా మూడు పేజీల వివరణను ఇడి అధికారికి అనిల్ పంపించారు. అందుకు ఒకటి,రెండు రోజుల సమయం పడుతుందంటూ అందులో పేర్కొన్నారు.
ఈ కేసులో తనపై ఇడి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ అనిల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అందుకు నిరాకరిస్తున్నట్టు ఆగస్టు 16న తీర్పు వెల్లడైంది. ఆ తర్వాతే మరోసారి అనిల్‌తోపాటు ఆయన కుమారుడు హృషికేశ్‌కు కూడా ఇడి నోటీసులు జారీ చేసింది. అయితే,క్వాష్ పిటిషన్‌సహా ఇతర న్యాయపరమైన అవకాశాల్ని వినియోగించుకునే వీలున్నదని తనకు సుప్రీంకోర్టు సూచించిందని అనిల్ చెబుతున్నారు. ముంబయి పోలీస్ అధికారులు నెలకు రూ.100 కోట్ల చొప్పున బార్లు, రెస్టారెంట్ల నుంచి తనకు వసూల్ చేసి ఇవ్వాలంటూ మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో అనిల్‌దేశ్‌ముఖ్ మౌఖిక ఆదేశాలిచ్చినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధించిన అక్రమ సంపాదన విషయంలోనే ఇడి దర్యాప్తు జరుపుతోంది.