మన తెలంగాణ/ హైదరాబాద్: నగర శివారు సమీపంలోని ఘట్కేసర్‌లో ఉన్న అఘోరా కాళీ మందిర్ లో జరుగుతున్న జంతుబలులు, రక్తాభిషేకాలు,వీడియోలను సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు జీవకారుణ్య కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆదివారం సైఫాబాద్‌లోఅంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాసరావు కార్యాలయంలో జీవకారుణ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బలి ఇచ్చిన జంతువుల రక్తంతో విగ్రహాలకు అభిషేకం చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని.
Also Read: రాజస్థాన్‌లో తల్లి, పిల్లల విషాదాంతం
ఆ వీడియో సాక్ష్యాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అఘోరా కాళీ మందిర్ పేరిట యూట్యూబ్ లో ఛానల్ నిర్వహిస్తూ 180 కి పైగా వీడియోలు ఆప్‌లోడ్ చేశారని, వాటిని 21 లక్షల పైగా వీక్షించారని చెప్పారు. యూట్యూబ్ తో పాటు ఇన్‌స్ట్రాగాం, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా వేదికలలోకూడా పోస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. బలులు ఇవ్వడం చట్ట ఉల్లంఘనకు పాల్పడటంతో పాటు సాంఘిక మాధ్యమాలలో ప్రచారం చేయడాన్ని మరింత తీవ్ర నేరంగా పరిగణించి కేసు నమోదు చేయవలసిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా యాజమాన్యాలకు లీగల్ నోటీసులు జారీ చేశామని, సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కావేటి శ్రీనివాసరావు కోరారు. ఈకార్యక్రమంలో యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా సభ్యుడు కమలేష్ , అఖిల భారత గో సేవా సంఘ్ అధ్యక్షుడు బాలకృష్ణ గోస్వామి , డాక్టర్ శశికళ , వర్ధని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.