హైదరాబాద్: జంతువుల దహన వాటిక త్వరలో నాగోల్ సమీపంలోని ఫతుల్లగూడలో రాబోతోంది. నగరంలో జంతు ప్రేమికులు లక్షల సంఖ్యలో ఉన్నారు. అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో పెంపుడు జంతువులు మరణించిన సమయంలో వాటి దహన సంస్కారాల నిర్వహణ ఇబ్బందిగా మారుతోంది. జంతు ప్రేమికులు, సామాజిక కార్యకర్తల విజ్ఞప్తుల నేపథ్యంలో వాటికోసం ప్రత్యేక దహన వాటిక ఏర్పాటు చేయాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించింది. ఇందుకోసం స్థలం కేటాయించడంతోపాటు యంత్రాల ఏర్పాటుకు కోటి రూపాయల నిధులు వెచ్చించారు. నిర్వహణ బాధ్యతలు కేంద్ర జంతు సంక్షేమ బోర్డు గుర్తింపు ఉన్న ‘పీపుల్ ఫర్ ఏనిమల్స్(పిఎఫ్ ఏ)’ సంస్థకు అప్పగించారు. పెంపుడు జంతువుల దహన సంస్కారాలు నిర్వహించినప్పుడు సంబంధిత వ్యక్తుల నుంచి నిర్ణీత రుసుము వసూలు చేస్తారు. ఏ జంతువుకు ఎంత రుసుము తీసుకోవాలన్నది ఇంకా నిర్ణయించ లేదని ఓ అధికారి తెలిపారు.
ఎల్‌పిజితో పనిచేసే దహన వాటిక నుంచి ఎలాంటి పొగరాదు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం దహన వాటిక నిర్మించామని ఓ అధికారి పేర్కొన్నారు. గంటకు 50 కిలోల మేర దహనం చేసే సామర్థ్యం ఇక్కడి యంత్రానికి ఉంటుంది. వీధి కుక్కలు, ఇతర జంతువులనూ ఇక్కడ దహనం చేయనున్నారు.