మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో భానుడి ప్రతాపంతో పచ్చని అడవులు కళావిహీనంగా కనిపిస్తున్నాయి.. నీటి వనరులు క్షీణిస్తున్నాయి. వన్యప్రాణులు దాహార్తి తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాయి. సహజ వనరుల జాడలు కనిపించకపోవడంతో రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాల్లో మూగజీవాల దాహర్తిని తీర్చేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. టైగర్ రిజర్వ్ ప్రాజెక్టులో పాటు అటవీ ప్రాంతాల్లో కృత్రిమ నీటి వనరుల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. అటవీ ప్రాంతాల్లో జింకలు, కుందేళ్లు, నక్కలు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, సాంబార్లు, అడవి పందులు, కోతులు తదితర వన్యప్రాణుల సంరక్షణకు పక్కాగా చర్యలు చేపట్టింది. వేసవి ఉష్ణోగ్రత్తలకు వాగులు, కుంటల్లో నీరు వేగంగా ఇంకిపోతోంది. అటవీ ప్రాంతంలో కొన్ని చోట్ల దొరికే కొద్దిపాటి నీటిని తాగుతున్న కోతులు దాహార్తిని తీర్చుకుంటున్నాయి. అడవుల్లో ఉండే వాగులలో ఇసుక, మట్టి తరలిస్తుండటంతో నీటి లభ్యత భారీగా తగ్గుతోంది. దీంతో వన్యప్రాణులకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అడవుల్లో వన్యప్రాణులకు వేసవి నీటి ఎద్దడిని తీర్చేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో కృత్రిమ నీటి వనరులను ఏర్పాటు చేసింది. కొండలు.. గుట్టల నుంచి వచ్చే నీటిని ఒడిసి పట్టేందుకు చెక్ డ్యామ్‌లను, రాతి కట్టడాలు, సాసర్ గుంతలను అందుబాటులోకి తెస్తున్నారు. నీటిని గుంతల్లో నింపేందుకు బోరుబావులు తవ్వించి సోలార్ విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన చోట్ల ట్యాంకర్లను వినియోగిస్తున్నారు.
వన్యప్రాణుల సంరక్షణలో..
అడవుల్లో లభ్యమయ్యే అటవీ విత్తనాల సేకరణను వేసవి కావడంతో ముమ్మరం నిర్వహిస్తున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలతో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో వన్యప్రాణుల పర్యవేక్షణను అటవీ సిబ్బందితో కలిసి అటవీ సంరక్షణ పరిశీలకుల సహాయం అందిస్తున్నారు. విత్తనాల సేకరణకు అడవుల్లోకి వెళ్లే అటవీ సంరక్షకులు వన్యప్రాణులకు నీటి ఇబ్బందులను సిబ్బందికి సూచిస్తున్నారు. దీంతో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.