Sunday, January 19, 2025

అంజలి కుటుంబానికి ఇక దిక్కేమిటి?…

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 20ఏళ్ల అంజలి సింగ్ కొత్త సంవత్సరం తెల్లవారు జామున ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయింది. ఆమె కుటుంబానికి ఆమె ఒక్కతే పోషణకర్త. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి, తన ఐదుగురు తోబుట్టువులు ఆనందంగా జీవితం గడపాలన్న లక్ష్యంతో ఆమె కష్టపడింది. తానో బ్యూటిషన్ కావాలని, తన స్వంత పార్లర్‌ను తెరవాలని ఆమె కలలు కన్నది. కాని విధి విలాసం మరోలా ఉండింది. న్యూ ఇయర్ తెల్లవారు జామున ఆమె స్కూటర్‌ను ఓ కారు ఢీ కొంది. అంతేకాదు ఆమె శరీరాన్ని దాదాపు 12 కిమీ. మేరకు లాక్కెళ్లింది. ఢిల్లీకి చెందిన శివారు ప్రాంతమైన కంఝవాలా ప్రాంతంలో చివరికామె మృతదేహం లభ్యమైంది.

ఆ కారులో ప్రయాణించిన ఐదుగురిని హత్యానేరం, ఇతర సెక్షన్ల కింద అరెస్టు చేశారు. వారందరినీ సోమవారం మూడు రోజుల పోలీస్ కస్టడీకి పంపారు. కుటుంబ పోషణార్థం అంజలి సింగ్ ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి పనిచేస్తుండేది. ఇంటి పోషణ భారమంతా ఆమెదేనని ఆమె కుటుంబ సభ్యులు, మిత్రులు తెలిపారు. ఆమె సంపాదన స్థిరంగా ఉండేది కాదు. ఆమె కొన్ని సందర్భాల్లో తన తల్లికి రూ. 500, మరి కొన్ని సందర్భాల్లో రూ. 2000 ఇచ్చేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆ దురదృష్టపు రోజున అంజలి, ఆమె స్నేహితురాలు నిధి ఓ హోటల్‌లో పార్టీ కోసం పనిచేశారు. అక్కడ వారు కొంత మంది పురుషులతో గొడవపడ్డారు. ఆ తర్వాత వారు ఆ హోటల్ నుంచి వెళ్లిపోయారని పోలీసు వర్గాలు తెలిపాయి.
అంజలి కరణ్ విహార్ నుంచి వెళుతున్నప్పుడు తన తల్లి రేఖతో మరునాడు ఉదయం వస్తానని తెలిపింది. కానీ మరునాడు ఆమె సోదరికి పోలీసుల నుంచి ఫోన్ కాల్ మాత్రమే అందింది. అంజలికి రోడ్డు ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. దాంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి హుటాహుటిన వెళ్లారు.

‘కొన్ని సందర్భాల్లో ఆమె పొద్దునే వెళ్లి రాత్రికి వచ్చేస్తుంటుంది. మరికొన్ని సందర్భాల్లో రెండో రోజు ఉదయం వస్తుంటుంది. మేము తనని ఎక్కువ ప్రశ్నించే వాళ్లం కాము. ఆ రోజున మాత్రం ఆమె పార్టీకి వెళుతున్నట్లు చెప్పింది. రాత్రి 9 గంటలకు నేను ఆమెను రెండుసార్లు కాల్ చేశాను. చివరిసారిగా తను మాట్లాడినప్పుడు డిన్నర్ చేసి పడుకోమని కోరింది. అంతేకాక మరునాడు తానొచ్చేస్తానంది. బయటికెళ్లి పనిచేయాల్సిన పరిస్థితి విధి ఆమెకు కల్పించింది. ఆడవాళ్లు రాత్రుల్లో బయటికెళ్లి పనిచేసి రావడం అంత భద్రమేమి కాదు. కానీ ఆమెకు వేరే దారిలేదు కూడా’ అని ఆమె తల్లి రేఖ చెప్పుకొచ్చింది.

ఎనిమిదేళ్ల క్రితం అంజలి తండ్రి మరణించాడు. ఓ ఆస్తి వివాదంలో మరో కుటుంబ సభ్యుడు ఆయనపై దాడిచేశాడు. ఆమె తల్లి పాఠశాలలో పనిచేస్తుండేది. కానీ ఆమెకు కిడ్నీ సంభందిత అనారోగ్యం ఏర్పడ్డంతో మంచాన పడింది. అంజలికి తల్లే కాకుండా, ఇద్దరు అక్కలు(పెళ్లయింది), ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. అంజలి కేవలం 9వ తరగతి మాత్రమే చదువుకున్నప్పటికీ ఇంటి బాధ్యత అంతా చూసుకునేది. ‘ బోజనం తేవడం దగ్గరి నుంచి స్కూల్ ఫీజలు కట్టడం వరకు అన్నింటినీ చూసుకునేది…ఆమె ఏ పనిచేసినప్పటికీ, ఆమెకు ఇలా జరిగి ఉండాల్సింది కాదు. కారులోని వారు కారాపేసి ఆమెను కారు నుంచి వేరు చేసి ఉండొచ్చు. అలా చేసుంటే ఆమె బతికి ఉండేది. కానీ వారు చాలా దూరం వరకు అలాగే కారును పోనిచ్చారు’ అని ఆమె అత్త తెలిపింది. అంజలి మరణంతో ఆమె కుటుంబ సభ్యులు సంపాదించే వారు లేక దిక్కులేని వారయ్యారు. అంజలి చాలా కష్టించి పనిచేసేది. డబ్బు సంపాదించేది. కొన్ని సందర్భాల్లో బంధువుల నుంచి అప్పు తెచ్చయినా కుటుంబ సభ్యులను పస్తులతో పడుకోకుండా చూస్తుండేది.

అంజలి టూవీలర్ ఘటన గురించి కొన్ని వర్గాలు ఇలా చెప్పాయి…ఆ ఇద్దరు మహిళల స్కూటర్‌ను కారు ఢీకొట్టింది. అప్పుడు అంజలి ఎడమ పక్కనున్న ముందు టైరు కింద చిక్కుకుపోయింది. కారు నడిపినవారు ఆమెను 12 కిమీ. వరకు అలాగే లాక్కెళ్లారు. ఈ కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు ఢిల్లీ పోలీసులకు మూడు రోజుల్లో అందనుంది. నిందితులు మత్తులో కారు నడిపారా అన్నది గుర్తించేందుకు మంగళవారం వారి రక్తపు నమూనాలు తీసుకున్నారు. ఏదైతేనేం అంజలి మరణంతో ఆమె కుటుంబానికి తీరని లోటు ఏర్పడింది.

Anjali

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News