కేంద్ర మంత్రి పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్ తనకు ఇవ్వకుండా అడ్డుకున్నది వారే
రెడ్డి సామాజికవర్గం నేతలపై మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్ మండిపాటు
మన తెలంగాణ/హైదరాబాద్ : తనకు గతంలో కేంద్ర మంత్రి పదవి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వకుండా సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారని కాంగ్రె స్ సీనియర్ నేత, మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో సోమవారం ఓల్డ్ ఎంఎల్‌ఎ క్వార్టర్స్ ఆదర్శనగర్‌లో జరిగిన యాదవ సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అంజన్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ కులగణన చేపట్టి బిసి కులాల లెక్కలు తేల్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం, సిఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కులగణన ప్రక్రియ పూర్తి చేశారన్నారు. అందుకే యాదవుల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పేందుకు సమావేశం ఏర్పా టు చేసుకున్నట్లు తెలిపారు.
సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఆమె పాత్ర ఏం లేదన్నవాళ్లు కులగణను తప్పుల తడక అంటే ఎవరు నమ్ము తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ‘రెడ్డి’ భజన సంఘాలు కాంగ్రెస్‌లోకి వచ్చాయని ఆయన గుర్తు చేసారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్నది ఇదే సామాజికవర్గం నేతలని అంజన్‌కుమార్ యాదవ్ ఆరోపించారు. ఇక నుంచి యాదవుల కు పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వకుంటే సహించేది లేదని హెచ్చరించారు. పార్టీ ఓడిపోయే సమయంలో తనకు ఎంపి టికెట్ ఇచ్చారని ఆయన విమర్శించారు. పార్టీ ఓడిపోయి ఇంట్లో కూర్చున్న దానం నాగేందర్‌ను తీసుకవచ్చి కాంగ్రెస్ పార్టీ ఎంపి ఇస్తే ఓడిపోయారని పేర్కొన్నారు. తనకు వర్కింగ్ ప్రెసిడెం ట్ పదవిని ఈ భజనగాళ్లు రెడ్లు ఇవ్వలేదని, సోనియాగాంధీకి చెప్పి తనకు లాలూ ప్రసాద్ యాదవ్ ఆ పదవి ఇప్పించారని అంజన్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వొద్దని పార్టీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి అడుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించానరు. ఎమ్మెల్యేగా ఓడి పోయి ఎంపిగా పోటీ చేసేది ఈ రెడ్డి సామాజికవర్గమేనని ఆయన ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ఎన్నికలలో జీవన్ రెడ్డి ఒడిపోయినా మళ్లీ ఆయనకు ఎంపి టిక్కెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. పక్కపార్టీ వాణ్ణి తీసుకొచ్చి ఎంపి టిక్కెట్ ఇచ్చారని, పార్టీ గెలిచే సమయంలో తనకు ఎంపి టిక్కెట్ ఇవ్వలేదని అంజన్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. సికింద్రాబాద్ ఎంపి టిక్కెట్ తనకు ఇస్తే గెలిచేవాడినని, దానం నాగేందర్‌కు టిక్కెట్ ఇవ్వడం వల్లనే పార్టీ ఓడిపోయిందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు వజ్రేష్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్, గజ్జి భాస్కర్ యాదవ్‌తో పాటు యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.