హైదరాబాద్: రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డిజిగా శనివారం నాడు డిజి అంజనీకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈక్రమంలో ఎసిబి డిజిగా కీలక బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రికి డధన్యవాదాలు తెలిపారు. ఎసిబి డిజిగా కొనసాగిన డిజి గోవింద్ సింగ్ తన బాధ్యతలను అంజనీకుమార్‌కు అప్పగించారు. ఎసిబి డిజిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని, ఇక్కడ కూడా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తానని అంజనీకుమార్ తెలిపారు. ఎసిబి డిజిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ కమిషనర్ గా చేసిన పని సంతృప్తినిచ్చిందని, విధి నిర్వహణలో అన్ని వర్గాల నుంచి పూర్తిస్థాయి సహకారం అందిందన్నారు. తనతో పాటు కలిసి మూడు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు పనిచేసిన అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
కరోనా కాలంలోనూ పోలీసుశాఖ ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు ముందుకెళ్లిందన్నారు. హైదరాబాద్ నగరంలో ఒక మంచి సంస్కృతి ఉందని, ఆ సంస్కృతిని ఇన్నాళ్ల పాటు తాను సిపిగా ఉంటూ కంటిన్యూ చేశానన్నారు. తాను హైదరాబాద్ సిపిగా విధులు నిర్వహించిన సమయంలో సమిష్టికృషితో అసెంబ్లీ, ఎంపి, జిహెచ్‌ఎంసి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూశామన్నారు. కరోనా మొదటి, రెండో దశల్లోనూ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు ఎంతో ధైర్యసాహసాలతో విధులు నిర్వహించారని గుర్తు చేశారు. ఎంఎల్‌ఎ, మంత్రులు ఎంతో సహకరించడం వల్ల శాంతిభద్రతల నిర్వహణ సులువైందన్నారు.రాష్ట్ర ఎసిబి డిజిగా బాధ్యతలు అప్పగించారని, తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శాఖాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటానన్నారు.