Thursday, January 23, 2025

కాంట్రాక్ట్ ఎఎన్‌ఎమ్‌లను పర్మినెంట్ చేయాలి: ఆర్ కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఎఎన్‌ఎమ్‌లను వెంటనే పర్మినెంట్ చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎఎన్‌ఎమ్ ల యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి పెద్ద ఎత్తున నర్సులు తరలివచ్చారు. కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో నాయకులు తోట రామాంజనేయులు, గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, మమత, వనజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో అమలు చేస్తూ గ్రామాల్లో, వార్దు స్థాయిలో ప్రజలందరికీ మాతా శిశు సంరక్షణ, ఆసుపత్రి ప్రసవాలు, సంక్రమిత వ్యాధులు, అసంక్రమిత వ్యాధుల నిర్మూలనకు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు.

ప్రజారోగ్య కార్యక్రమాల అమలు, మాతా శిశు మరణాల సంఖ్య తగ్గుదల, జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ఆరోగ్య రంగంలో మూడవ స్థానం సాదించుటకు విశేషంగా కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. కోవిడ్‌ను అదుపు చేసే కార్యక్రమాల్లోనూ ఎఎన్‌ఎమ్‌లు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పనిచేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ కాలం నుండి సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన ముఖ్యమంత్రి వీరి సమస్యలు పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు డీమాండ్‌లు ప్రభుత్వం ముందుంచారు. వాటిని నేరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 2వ ఎఎన్‌ఎమ్‌లను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం లేదా బేసిక్ పే అమలు చేయాలని,

యూనిఫారం అలవెన్సులు ఇవ్వాలని, రూ. 5 వేలు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని, కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్నందుకు టిఎ, డిఎలు ఇవ్వాలని, కోవిడ్ వ్యాక్సిన్ టీకా వేసినందుకు రూ.15ల ఇన్సెంటివ్ ఇవ్వాలని, 35 రోజుల ఐచ్ఛిక సెలవులు, 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, ప్రధానమైన 16 డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News