తిరుమల: అంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన విషయం తెలిసిందే. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో అతను గాయాలతో బయటపడ్డాడు. మూడు రోజుల పాటు సింగపూర్‌లో అతనికి చికిత్స అందించారు. ఆదివారం ఉదయమే పవన్‌కళ్యాణ్, భార్య అన్నా లెజినోవాలు మార్క్ శంకర్‌ని హైదరాబాద్ తీసుకువచ్చారు. అయితే తన కుమారుడు కోలుకోవడంతో మొక్కులు చెల్లించుకోవడానికి అన్నా తిరుమలకు పయనమయ్యారు.
ఆదివారం సాయంత్రం ఆమె తిరుమలకు చేరుకున్నారు. గాయత్రి నిలయం వద్ద టిటిడి అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ రాత్రి తిరుమలలో ఆమె బస చేస్తారు. సోమవారం ఉదయం సుప్రభాత సేవలో స్వామిని దర్శించుకుంటారు. ఆమెతో పాటు మార్క్ శంకర్, కూతురు పొలెనా అంజనా కూడా ఉన్నట్లు సమాచారం. అనంతరం వాళ్లు హైదరాబాద్‌కు తిరిగి పయనమవుతారు. అయితే వీళ్లతో పాటు పవన్ కూడా స్వామివారిని దర్శించుకుంటారని వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ, ఇప్పుడు ఆయన సతీమణి మాత్రమే తిరుమలకు వెళ్లినట్లు స్ఫష్టమైంది.