Wednesday, September 18, 2024

తెలంగాణ ముమ్మాటికీ ‘అన్నపూర్ణే’

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఒకప్పుడు పంటలు పండక, ఎలాంటి సహాయం అందక రైతులు అప్పులపాలై ఇతర ప్రాంతాలకు కూలీలుగా వలసలుపోవడం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం వంటి దారుణమైన దృశ్యాలు కనిపించేవి. కానీ, ఇప్పుడు అన్ని రాష్ట్రాల కన్నా వ్యవసాయ రంగంలో ఇతోధిక ప్రగతి సాధించి విత్తన భాండాగారంగానే కాకుండా అన్నపూర్ణ అన్న ప్రఖ్యాతిని నిలబెట్టుకుంటోంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 201819 నుంచి 202324 మధ్య కాలంలో అత్యధిక వార్షిక రేటు 16.42 శాతం వరకు రికార్డు సాధించి టాప్ వన్‌గా 10 రాష్ట్రాల్లో ముందు వరుసలో చేరింది. రెండో స్థానంలో మహారాష్ట్ర 7.11, మూడో స్థానంలో బీహార్ 5.14 వార్షిక వృద్ధిరేటు తో తొలి పది స్థానాల్లో నిలిచాయి.

దీనికి విరుద్ధంగా పశ్చిమబెంగాల్ కేవలం 0.14% మాత్రమే వార్షిక రేటు సాధించి అట్టడుగు ర్యాంకులో చేరింది. ఈ రాష్ట్రాల్లో మధ్యస్థ వృద్ధి రేటు 2.45% వరకు సూచించి చెప్పుకోదగిన వ్యత్యాసం కనిపించింది. 201819 నుంచి 2023 24 మధ్యకాలంలో వ్యవసాయ మంత్రిత్వశాఖ అందజేసిన డేటా ప్రకారం రాష్ట్రాలు ఏ విధంగా ఆహార ఉత్పత్తి సంక్లిష్ట దృశ్యాన్ని ఆవిష్కరించాయో వెల్లడైంది. ఈ విశ్లేషణ అత్యాధునిక సాంకేతిక ప్రక్రియలను, ప్రాంతీ య వ్యూహాలను, ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని స్పష్టం చేసింది. తెలంగాణలో ఈ విజయానికి ప్రధాన కారణం వ్యవసాయ విధానాల్లో ప్రభుత్వం మార్పు తీసుకురావడమే. ముఖ్యంగా రైతుబంధు స్కీమ్, రైతులకు ఆర్థికంగా ఆదాయ భరోసా కల్పించింది. రుణాలిచ్చే వడ్డీ వ్యాపారస్థులపై ఆధారపడే అవసరాన్ని తగ్గించింది.

దీంతోపాటు రైతు బీమా కార్యక్రమం ఆర్థిక భద్రతను కల్పించింది. ఇంతేకాకుండా విత్తనాలు, తదితర వ్యవసాయ అవసరాల పంపిణీకి రైతు వేదికలను నిర్మించింది. ట్రాక్టర్లు, ఇతర యంత్రాలు సరఫరా చేసి వ్యవసాయ యాంత్రీకరణను విస్తరింప చేసింది. ఎరువుల వినియోగంతోపాటు వరిధాన్య సేకరణ, చెప్పుకోదగినంతగా అభివృద్ధి చెందింది. దీంతో పంట దిగుబడులు భారీగా పెరిగాయి. రైతుల రుణమాఫీ చేయడం, ఇతర సహాయ కార్యక్రమాలు తెలంగాణ వ్యవసాయ రంగంలో సుస్థిర అభివృద్ధిని సాధించి పెట్టాయి. వ్యవసాయం చాలా సానుకూలమైనదిగా, ఉత్పత్తిదాయకంగా తీర్చిదిద్దాయి. తెలంగాణ పటిష్టమైన వ్యవసాయ నిర్వహణకు అభినందనలు చెప్పాల్సిందే. తెలంగాణతో పాటు దక్షిణ ప్రాంతం ఆహార ధాన్యాల అభివృద్ధిలో ముందంజలోనే ఉందని చెప్పవచ్చు. సరాసరి అభివృద్ధి రేటు 9.80% వరకు సాధించింది.

దీని తరువాత పశ్చిమ ప్రాంతం మహారాష్ట్ర ప్రభావంతో 7.11 శాతం అభివృద్ధి రేటును చూపించింది. సెంట్రల్ రీజియన్ మధ్యప్రదేశ్ ప్రభావంతో 4.53 శాతం మధ్యస్థ వృద్ధికే పరిమితమైంది. తూర్పు, ఉత్తరాది ప్రాంతాలు క్రమంగా 2.64 శాతం, 1.09 శాతం స్థాయిలో వెనుకబడ్డాయి. సంప్రదాయ వ్యవసాయిక విధానాలకే కట్టుబడిన పంజాబ్, హర్యానా వంటి ఉత్తరాది రాష్ట్రాలు చాలా తక్కువ సరాసరి అభివృద్ధిని చూపించాయి. ఉత్పత్తిని పెంచడంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఇటీవల కాలంలో సాగుభూమి విస్తీర్ణం తగ్గినప్పటికీ భారత్ విజయవంతంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచుకోగలిగింది. 201819 లో సాగు విస్తీర్ణ భూమి 18,06, 24,000 హెక్టార్లు ఉండగా, 202122 లో 18,01,12,000 హెక్టార్లకు తగ్గింది. అంటే నాలుగేళ్లలో 5,12,000 హెక్టార్ల వరకు తగ్గింది.

పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ, ఆహార ధాన్యాల ఉత్పత్తి మాత్రం 201819 లో 2852.09 లక్షల టన్నుల వరకు, 202324 లో 3288.52 లక్షల టన్నుల వరకు దిగుబడి చూపించింది. సాగుభూమి తగ్గినప్పటికీ, వివిధ రాష్ట్రాలు తమ వ్యవసాయ ఉత్పత్తిని వేర్వేరుగా చూపించాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో 201819 నుంచి 202122 మధ్యకాలంలో 18,77,5000 హెక్టార్ల నుంచి 18,26, 4000 హెక్టార్లకు సాగుభూమి తగ్గినప్పటికీ, ఆహార ధాన్యాల ఉత్పత్తి మాత్రం 546.43 లక్షల టన్నుల నుంచి 592.91 లక్షల టన్నుల వరకు పెరిగింది. అలాగే పంజాబ్‌లో 42,33,000 హెక్టార్ల నుంచి 42,25,000 హెక్టార్లకు సాగుభూమి తగ్గిపోయినా, ఆహార ధాన్యాల ఉత్పత్తి మాత్రం 315.32 లక్షల టన్నుల నుంచి 325.86 లక్షల టన్నులకు పెరిగింది.

అత్యంత ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించడమే ఈ ప్రగతికి కారణం. అయితే దీనికి విరుద్ధంగా మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో సాగుభూమి పెరగడంతోపాటు ఆహార ధాన్యాల ఉత్పత్తులు కూడా పెరగడం విశేషం. మధ్యప్రదేశ్‌లో సాగుభూమి 17,12,1000 హెక్టార్ల నుంచి 17,43,2000 హెక్టార్లకు స్వల్పంగా పెరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 322.09 లక్షల టన్నుల నుంచి 399.43 లక్షల టన్నులకు పెరిగింది. ఇదే విధంగా గుజరాత్‌లోనూ అభివృద్ధి కనిపించింది. పంజాబ్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 2018 19లో హెక్టారుకు 7.45 టన్నుల వరకు ఉండగా, 202324 లో హెక్టారుకు 7.71 టన్నుల వరకు ఉత్పత్తి పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News