Monday, December 23, 2024

ఆరు స్థానాలకు ఎంఐఎం అభ్యర్థులు ప్రకటన

- Advertisement -
- Advertisement -

9 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం, త్వరలో మిగతా జాబితా విడుదల
దమ్ముంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తనపై పోటీ చేయాలి
తెలంగాణలో మరోసారి బిఆర్‌ఎస్ గెలుస్తుంది: అసద్దుద్దీన్ ఓవైసీ

మన తెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఎంఐఎం అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విడుదల చేశారు. శుక్రవారం మొదటి జాబితాలో ఆరుగురు పేర్లును ప్రకటించారు. చార్మినార్ – జుల్పికర్ అహ్మద్, చాంద్రాయణ గుట్ట – అక్బరుద్దీన్ ఓవైసీ, మలక్ పేట్ – అహ్మద్ బలాల, నాంపల్లి – మాజీద్ హుస్సేన్, కార్వాన్ – కౌజర్ మొయినుద్దీన్, యాకత్‌పురా – జాఫర్ హుస్సేన్ మీరజ్‌ల పేర్లను అసదుద్దీన్ ఓవైసీ ఖరారు చేశారు. ఈ సారి తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఓవైసీ మిగిలిన మూడు స్థానాలకు తర్వలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 9 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఇప్పటి వరకు ఏడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నామని ఈ సారి ఎన్నికల్లో మరో రెండు కొత్త నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తోన్న చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్‌పూరా, బహదూర్‌పూరా, నాంపల్లి, కార్వాన్, మలక్‌పేట్‌తో పాటు ఈ సారి జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దమ్ముంటే తనపై పోటీ చేయాలని ఓవైసీ ఛాలెంజ్ విసిరారు. తనపై పోటీ చేస్తే తన బలమెంటో చూపిస్తానన్నారు. విద్వేషంతోనే తనపై రాహుల్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, నెత్తిపై టోపీ, గడ్డం ఉంది కాబట్టే తనపై రాహుల్ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎం బలమెంటో రాహుల్ నాన్నమ్మ ఇందిరాగాంధీకి తెలుసని, కానీ రాహుల్‌కు తెలియడం లేదని ఓవైసీ వ్యాఖ్యానించారు.

బాబ్రీ మసీద్ కూల్చివేతలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ మాదిరిగా కాంగ్రెస్ పాత్ర కూడా ఉందని, ఇందుకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీది జూటా సెక్యులరిజం అని దుయ్యబట్టారు. ముస్లింలు మందిరాలను కూల్చివేశారని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీది కేవలం పొలిటికల్ సెక్యులరిజం అని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ ఒక్కటే ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో 11 సార్లు కర్ఫ్యూ విధించారని, సిఎం కెసిఆర్ పాలనలో రెండుసార్లు కర్ఫ్యూ విధిస్తే, అందులో ఒకసారి కరోనా సమయంలో అని అన్నారు. 2014 నుంచి అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తుందని, ఈ సారి కూడా తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీనే గెలుస్తుందని, దీంట్లో ఎటువంటి అనుమానం లేదని కుండబద్దలు కొట్టారు. బీఆర్‌ఎస్ పార్టీకే మా పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

అజారుద్దీన్‌తో తనకు సంబంధం లేదని, ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అని, అజారుద్దీన్ సోదరులు తన స్నేహితులని వెల్లడించారు. జూబ్లీహిల్స్ లో బిఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వమని, ఎంఐఎం అభ్యర్ధిని గెలిపించుకుంటామని తెలిపారు. అంబర్‌పేట నుంచి కిషన్ రెడ్డి పోటీ చేయకుండా ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఇప్పుడు బిసి సిఎం అంటూ కొత్త రాగం బిజెపి అందుకుందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక చదవలేదని, మరమ్మతులకు అయ్యే ఖర్చు నిర్మాణ సంస్థ భరిస్తుందని కెటిఆర్ చెప్పారని, రాష్ట్ర ఖజానాపై ఎలాంటి నష్టం ఉండదని ఓవైసీ వ్యాఖ్యానించారు. ఎంఐఎం, బిజెపి నుంచి డబ్బులు తీసుకుని వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెడుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించడంపై మండిపడ్డారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథి నుంచి ఓడిపోవడానికి ఎన్ని డబ్బులు తీసుకున్నానని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. 2014, 2019లో ఓడిపోవడానికి మీరు బిజెపి నుంచి డబ్బులు తీసుకున్నారా అని నిలదీశారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News