తేలిపోయిన తజిందర్‌పాల్
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మంగళవారం కూడా నిరాశే మిగిలింది. అథ్లెటిక్స్‌లో పతకాలు సాధిస్తారని ఆశలు పెట్టుకున్న అన్ను రాణి, తజిందర్ పాల్ సింగ్ నిరాశే మిగిల్చారు. తజిందర్ పాల్ షాట్‌పుట్ విభాగంలో కనీసం ఫైనల్‌కు కూడా అర్హత సాధించలేక పోయాడు. కచ్చితంగా పతకం సాధిస్తాడని నమ్మకం పెట్టుకున్న తజిందర్ పాల్ అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. 15 మంది పోటీ పడిన షాట్‌పుట్ క్రీడాంశంలో తజిందర్ 13వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 19.99 మీటర్ల దూరాన్ని మాత్రమే విసిరి నిరాశ పరిచాడు. పేలవమైన ప్రదర్శన చేసిన తజిందర్ పాల్ కనీసం ఫైనల్‌కు కూడా చేరలేక పోయాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇండియన్ గ్రాండ్ ప్రి ఈవెంట్‌లో 21.49 మీటర్ల దూరంతో జాతీయ రికార్డును నెలకొల్పిన తజిందర్ ఆ స్థాయి ప్రదర్శన కూడా చేయలేక పోయాడు. దీంతో తజిందర్‌పై పెట్టుకున్న పతకం ఆశలు ఆవివరయ్యాయి.
జావెలిన్ త్రోలోనూ..
మరోవైపు మహిళల జావెలిన్ త్రో విభాగంలో కూడా భారత్‌కు నిరాశే మిగిలింది. భారత స్టార్ అన్ను రాణి క్వాలిఫయింగ్ రౌండ్‌లో పేలవమైన ప్రదర్శనతో కనీసం ఫైనల్‌కు కూడా అర్హత సాధించలేక పోయింది. రెండు అర్హత పోటీలు పూర్తయ్యే సరికి అన్ను రాణి 29వ స్థానంలో నిలిచి పతకం ఆశలను నీరుగార్చింది. పోటీల్లో పాల్గొన్న ఇతర దేశాల అథ్లెట్లు 63 మీటర్ల ప్రదర్శనతో అలరించగా అన్ను మాత్రం 50.35 మీటర్ల దూరాన్ని మాత్రమే విసరడం గమనార్హం. ఈ పోటీల్లో మొత్తం 30 మంది అథ్లెట్లు పోటీ పడగా భారత క్రీడాకారిణి అన్ను రాణి అట్టగు స్థానంలో నిలిచింది.