Friday, November 22, 2024

దేశంలోకి మరి రెండు ఒమిక్రాన్ కేసులు

- Advertisement -
- Advertisement -

 ముంబయి, గుజరాత్ జాంనగర్‌లో ఒక్కొక్కటి గుర్తింపు
 ఒకరు దక్షిణాఫ్రికానుంచి, మరొకరు జింబాబ్వేనుంచి రాక

ముంబయి/అహ్మదాబాద్: భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కలవరపెడుతోంది. ఇప్పటికే కర్నాటక రాష్ట్రంలో రెండు కేసులు బయటపడగా తాజాగా శనివారం మరో మూడు కేసులు వెలుగు చూశాయి.మహారాష్ట్రలోని ముం బయిలో ఒకరు, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మరో వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. దీంతో ఇప్పటివరకు ఈ వేరియంట్ సోకిన ఐదు కేసులు దేశంలో వెలుగు చూశాయి. వారంతా కూడా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. గత నెల చివర్లో దక్షిణాఫ్రికా నుంచి దుబాయి, ఢిల్లీ మీదుగా ముంబయి వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు గుర్తించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇతను కొవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోలేదని, అయితే ఇతనిలో ఇతర లక్షణాలేమీ లేవని వారు తెలిపారు. స్వల్పకొవిడ్ లక్షణాలున్న ఈ వ్యక్తికి కళ్యాణ్‌డోంబ్రివాలిలోని కొవిడ్ కేర్ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నట్లు ఆ ప్రకటన తెలిపింది. ఇతనిని కలిసిన 12 మంది హైరిస్క్ కాంటాక్ట్‌లను, మరో 23 మంది లోరిస్క్ కాంటాక్ట్‌లను గుర్తించడం జరిగిందని, అందరికీ పరీక్షలు నిర్వహించగా కొవిడ్ నెగెటివ్‌గా తేలిందని ప్రభు త్వం తెలిపింది. అంతేకాకుండా ఢిల్లీ ముంబయి విమానంలో అతనితో ప్రయాణించిన 25 మంది ప్రయాణికులకు కూడా నెగెటివ్‌గా తేలిందని తెలిపింది, ప్రస్తుతం మరింత మంది కాంటాక్ట్‌లను గుర్తించడం జరుగుతోందని ఆ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కాగా జింబాబ్వేనుంచి ముంబయి వచ్చిన మరో 60 ఏళ్ల వ్యక్తికి నిర్వహించిన పరీక్షల్లో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించలేదని, అతనిలో రూపాంతరం చెందిన డెల్టా వేరియంట్ పాజిటివ్‌ను మాత్రమే గుర్తించినట్లు కూడా ప్రభుత్వం తెలిపింది.
జామ్‌నగర్‌లో మరొకరు
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఇటీవలే జింబాబ్వేనుంచి వచ్చిన 72 ఏళ్ల వ్యక్తిలో కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు రాష్ట్ర వైద్యాధికారులు చెప్పారు. ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం జింబాబ్వేనుంచి జామ్‌నగర్‌కు రాగా విమానాశ్రయం వద్ద అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం శాంపిల్స్‌ను అహ్మదాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు. తాజాగా వాటి ఫలితాలు వెల్లడయ్యాయి. అతను కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడినట్లు తేలింది. దీంతో ఆ రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. కట్టడి చర్యలపై దృష్టిపెట్టారు. కాగా కొత్త వేరియంట్ సోకిన వ్యక్తిని గురుగోబింద్ సింగ్ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసొలేషన్ వార్డుకు తరలించినట్లు జామ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ ఖరాడి చెప్పారు. జిల్లా అధికారులు ఇప్పటికే ఆ వ్యక్తితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించడం ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. జామ్‌నగర్‌కు చెందిన ఈ వ్యక్తి చాలా సంవత్సరాలుగా జింబాబ్వేలో ఉంటున్నారు. తన మామగారిని చూసేందుకు ఆయన పట్టణానికి వచ్చారు. అయితే జ్వరం రావడంతో అతను డాక్టర్‌ను కలిశారు. ఆర్‌టిపిసిఆర్ పరీక్ష చేయించుకోవలసిందిగా డాక్టర్ ఆయనకు సలహా ఇచ్చా రు. కాగా అతనికి కోవిడ్19 సోకినట్లు ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నిర్వహించిన ప్రైవేట్ ల్యాబ్ గురువారం అధికారులకు తెలియజేసింది. దీంతో శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌కు పంపించారు.
ఇజ్రాయెల్‌లో 7 ఒమిక్రాన్ కేసులు
దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌కు సంబంధించిన ఏడు కేసులు నమోదయినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో ఇప్పటికే కరోనా విజృంభణతో అల్లాడుతున్న ఆ దేశంలో ఇప్పుడు తాజాగా ఒమిక్రాన్ కారణంగా కేసులు మరింతగా పెరుగుతాయేమోనన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. ఒమిక్రాన్ సోకిన వారిలో నలుగురు వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులని, వారు ఇటీవలే దక్షిణాఫ్రికానుంచి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. మిగతా ముగ్గురిలో ఇద్దరు దక్షిణాఫ్రికా, బ్రిటన్‌నుంచి తిరిగి వచ్చిన వ్యక్తులు కాగా వీరు ఇప్పటికే ఫైజర్ బయో ఎన్‌టెక్ టీకా రెండు డోసులతో పాటు బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు. ఇక మూడో వ్యక్తి మలావినుంచి వచ్చాడు. ఇతను ఆస్ట్ట్రాజెనికా టీకా తీసుకున్నాడు. గత వారం దేశంలో తొలి ఒమిక్రాన్ కేసు వెలుగు చూసిన తర్వాత ఇజ్రాయెల్ ఇజ్రాయెలీ పౌరులు కాని వారికి తన సరిహద్దులను మూసివేసింది. అయితే ఇజ్రాయెల్ పౌరులు మాత్రం విదేశాలనుంచి రావడానికి అనుమతి ఇచ్చారు.
ద్వీప దేశంలో మొదటి కరోనా కేసు
కరోనా వ్యాప్తి మొదలైనప్పటినుంచి కొవిడ్ రహిత దేశంగా ఉన్న కుక్ ఐలాండ్స్‌లో శనివారం మొట్టమొదటి కేసు నమోదు అయింది. ఇటీవలే కుటుంబంతోసహా ఇక్కడికి చేరుకుని క్వారంటైన్‌లో ఉన్న ఓ పదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు ఆ దేశ ప్రధాని మార్క్‌బ్రౌన్ ఓ ప్రకటనలో తెలిపారు. వారు న్యూజిలాండ్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. పసిఫిక్ మహా సముద్రం లోని ఈ ద్వీప దేశంలో దాదాపు మొత్తం 17 వేల మంది జనాభాలో అర్హులైన వారిలో దాదాపు 96 శాతం మందికి రెండు డోసులూ పూర్తయ్యాయి. కరోనా వ్యాప్తి ప్రారంభం లోనే ఈ దేశం ఇతర దేశాలతో రాకపోకలు తెంచుకుంది. ఇటీవలే జనవరి 14 నుంచి న్యూజిలాండ్‌తో క్వారంటైన్ రహిత ప్రయాణాలను తిరిగి ప్రారంభించే విషయమై ప్రణాళికలు ప్రకటించింది. ఇదే తరుణంలో కరోనా మొదటి కేసు బయటపడింది.

Another 2 Omicron Cases found in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News