ఖమ్మం : తెలంగాణ దశాబ్ధ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర స్దాయిలో ఖమ్మం నగర కార్పొరేషన్‌కు అవార్డు దక్కింది. లక్ష కు పైగా జనాభా ఉన్న నగర కేటగిరీలో వినూత్న మున్సిపల్ మౌళిక సదుపాయాల కల్పన విభాగంలో పట్టణ ప్రగతి అవార్డ్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పొందింది. ఉత్తమ కూడళ్ళ అభివృద్ధి, సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్, పచ్చని మొక్కలతో కూడిన రోడ్ డివైడర్స్, వివిధ రకాల థీమ్స్ ని ప్రతిబింబించే వాల్ పెయింటింగ్స్, అత్యంత ఆహ్లాదకరమైన లకారం ట్యాoక్ బండ్, ఖానాపురం చెరువు జలాశయాల అభివృద్ధి, గోళ్లపాడు ఛానల్ సుందరీకరణ, సుందరమైన చారిత్రక పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి గాను ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కి ఈ అవార్డు దక్కింది.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్లు, మునిసిపల్ సిబ్బంది సమష్టి కృషితో ఇది సాధ్యమైంది. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పురపాలన, ఐటి శాఖల మంత్రి కే.తారకరామారావు చేతుల మీదుగా నగర మేయర్ పునుకొల్లు నీరజ, మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభిలు ఈ అవార్డ్ ను అందుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస గౌడ్, రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ సత్యనారాయణ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. వినూత్నంగా మౌలిక సదుపాయాల కల్పనలో ఖమ్మం నగరానికి అవార్డు దక్కడంపై రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ నగర పాలక సంస్ధ పాలకవర్గానికి అధికారులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.