Monday, December 23, 2024

బెంగాల్‌లో బిజెపికి మరో దెబ్బ

- Advertisement -
- Advertisement -

Another blow to the BJP in Bengal

 

దేశ ప్రజలు ప్రత్యామ్నాయ శక్తుల పాలనను కోరుకుంటున్నారని మరోసారి మరింత స్పష్టంగా రుజువైంది. బలమైన ప్రాంతీయ పార్టీల ఐక్యత ద్వారా ఏర్పడే మహా సంఘటన మాత్రమే దేశానికి మంచి పాలన అందించగలదనే అవగాహన అంతటా బలపడుతున్నది. బిజెపి ముక్త్ భారత్ ను సాధించాలనే తపన గట్టిపడుతున్నది. పాలన మరచి ప్రజలను విడదీసి విద్వేషాలు రెచ్చగొట్టి బాగుపడాలనే దృష్టితో, దేశాన్ని కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యం గుప్పెట్లోకి నెట్టివేయాలనే దుర్బుద్ధితో ఏడేళ్లకు పైగా జనహితాన్ని కాలరాస్తున్న కాషాయ శకానికి తెర దించాలనే చైతన్యం ఎల్లెడలా వ్యాపిస్తున్నదని వెల్లడవుతున్నది. మళ్లీ అధికారం వైపు కన్నెత్తి చూడకుండా భారతీయ జనతా పార్టీని తరిమి కొట్టాలనే దృష్టి సునిశితమవుతున్నదని భావించడానికి అవకాశమిచ్చే పరిణామాలు వరుసగా సంభవిస్తున్నాయి. ఇటీవల తమిళనాడు, ఒడిశాలలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అక్కడి పాలక పక్షాలు డిఎంకె, బిజెడి అనూహ్య విజయాలు సాధించాయి. ఆ రెండు రాష్ట్రాల ప్రజలు ప్రాంతీయ రాజకీయ శక్తుల వెంట బలంగా వున్నారని, జాతీయ పార్టీలకు నిలువ నీడ కూడా లేకుండా చేశారని ఆ ఎన్నికలు నిరూపించాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో కూడా అదే దృశ్యం కళ్లకు కట్టింది.

బెంగాల్‌లో పది మాసాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలు గెలుచుకున్న బిజెపి ఈ నెల 2న అక్కడ జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో నామరూపాల్లేకుండా పోయింది. అది ఒక్క మునిసిపాలిటీనైనా కైవసం చేసుకోలేకపోయింది. ఆ 77 అసెంబ్లీ స్థానాల పరిధిలోని ప్రజలు కూడా ఆ పార్టీ నిజస్వరూపం తెలుసుకొని దానిని తిరస్కరించారని రూఢి అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ఎక్కడా విజయం సాధించలేకపోయింది. అది మరింతగా సన్నగిల్లిపోయిందనడానికి ఇది ఒక నిదర్శనం. మొత్తం 108 మునిసిపాలిటీలలో 102 చోట్ల తృణమూల్ కాంగ్రెస్ విజయ భేరి మోగించిందంటే బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ నాయకత్వాన్ని ఎంతగా కోరుకుంటున్నారో అర్థమవుతున్నది. అలాగే దేశాన్ని బిజెపి గుప్పెట నుంచి తప్పించాలని మతతత్వ పాలన ఉక్కు పాదాల కింది నుంచి విముక్తం చేయాలని ఆమె సాగిస్తున్న రాజీలేని పోరాటానికి బెంగాల్ ప్రజలు గట్టి దన్నుగా నిలబడ్డారని మునిసిపల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎదురులేని గెలుపు నిరూపిస్తున్నది.

మూడు దశాబ్దాల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన వామపక్ష కూటమి కూడా ఒకే ఒక్క మునిసిపాలిటీతో సరిపెట్టుకోవలసి వచ్చింది. నదియా జిల్లా తహేర్ పూర్ మునిసిపాలిటీని వామపక్ష కూటమి గెలుచుకున్నది. విశేషమేమంటే శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు, నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీపై గెలిచిన బిజెపి ఎంఎల్‌ఎ సువేంధు అధికారి కంచుకోట అయిన కాంతి మునిసిపాలిటీని కూడా తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. బెంగాల్ ప్రజలు బిజెపిని ఎంతగా ద్వేషిస్తున్నారో, దేశ భవిష్యత్తు రాజకీయాలను కాషాయ శక్తులకు దూరంగా వుంచాలని వారు ఎలా తాపత్రయ పడుతున్నారో ఈ ఫలితాలు తిరిగి చాటింపు వేశాయి. గూర్ఖాలాండ్ రాజకీయాల కేంద్రమైన డార్జిలింగ్ మునిసిపాలిటీ మాత్రం స్థానిక కొండప్రాంత రాజకీయ శక్తుల ప్రాబల్యంలోనే వున్నదని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. కేవలం మూడు మాసాల క్రితమే ఏర్పాటైన హేమ్రో పార్టీ అక్కడ గెలుపు జెండా ఎగురవేసింది.

ఆ మునిసిపాలిటీలో గల మొత్తం 32 వార్డుల్లో అది 18 చోట్ల విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్నది. భారతీయ గోర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్ఛా 9 స్థానాలను గెలుచుకోగా, తృణమూల్ కాంగ్రెస్ కేవలం 2 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అక్కడ కూడా బిజెపికి ఒక్క వార్డూ లభించలేదు. అలాగే ఒకప్పుడు అక్కడ ఎదురులేని శక్తిగా నిరూపించుకున్న గూర్ఖా నేషనల్ ఫ్రంట్ (జిఎన్‌ఎల్‌ఎఫ్) ఒక్క స్థానాన్నీ కైవసం చేసుకోలేకపోయింది. గూర్ఖా లాండ్ సమస్య సమసిపోకుండా ఇంకా సజీవంగానే వున్నదని, ఉప ప్రాంతీయ ఆకాంక్షలను పట్టించుకోవలసిన అవసరం మమతా బెనర్జీ ముందున్నదని డార్జిలింగ్ ఫలితం ఎత్తి చూపుతున్నది.

మొత్తం మీద ప్రాంతీయ పార్టీలు బలంగా వున్న రాష్ట్రాల్లో జాతీయ పక్షాలకు సూదిమొన పాటి సందు కూడా లేదని పదేపదే రుజువవుతుండడం గమనించవలసిన విషయం. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల ఉమ్మడి ప్రాబల్యాన్ని, ఐక్య సంఘటనను నిర్మించి దేశ రాజకీయాల గతిని మార్చాలని, సెక్యులర్ రాజ్యాంగ ఆశయాన్ని అణగదొక్కి మతతత్వాన్ని పాలనకు దిక్సూచిగా చేయాలని చూస్తున్న శక్తులను అంతమొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పూనిన ప్రతిజ్ఞ నెరవేరే దిశగా దేశ ప్రజలు ఆలోచిస్తూ వుండడం ఆ దిశగా తమ ఓటును వారు వినియోగిస్తూ వుండడం సంతోషదాయకమైన అంశం. దేశంలో సంభవించగల పెను మార్పుకి ఇది నిదర్శనం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News