Saturday, November 23, 2024

హెచ్3ఎన్2 వైరస్ లక్షణాలతో మరొకరి మృతి… ఏడుకు పెరిగిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

వడోదర : హాంగ్‌కాంగ్ ఫ్లూగా పేర్కొనే హెచ్3 ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కలవర పెడుతోంది. ఈ వైరస్ లక్షణాలతో కర్ణాటకలో తొలి మరణం నమోదు కాగా, తాజాగా గుజరాత్ లోని వడోదరలో 58 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు. ప్లూ లక్షణాలతో బాధపడుతున్న ఆమెను చికిత్స కోసం వడోదర లోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచారు. హెచ్3 ఎన్2 వైరస్ ఆమె మృతికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వడోదర లోని ఫతేగంజ్‌కు చెందిన ఈ మృతురాలికి సంబంధించిన శాంపిల్స్‌ను పరీక్షించేందుకు రివ్యూ కమిటీకి పంపినట్టు తెలిపారు. గుజరాత్‌లో గత వారం రోజుల క్రితం వరకు హెచ్3 ఎన్2 కేసులు మూడు నమోదయ్యాయని ఆరోగ్యమంత్రి హృషికేశ్ పటేల్ ఇటీవల వెల్లడించారు. మార్చి 10 వరకు గుజరాత్ లో 80 సీజనల్ ఫ్లూ కేసులు నమోదవ్వగా, వాటిలో 77 ఇన్‌ఫ్లుయెంజా హెచ్1 ఎన్1 కేసులు కాగా, మూడు హెచ్3 ఎన్2 ఉపరకం కేసులే ఉన్నాయి.

మరోవైపు ఈ ఫ్లూ లక్షణాలతో ఇప్పటివరకు దేశంలో మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది. ఇదిలా ఉండగా, మార్చి నెలాఖరు నుంచి ఈ కేసులు తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నట్టు వైద్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొవిడ్ తరహా లక్షణాలున్న ఈ ఇన్‌ఫ్లుయెంజా కేసులతో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడి, ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతున్నట్టు భారత వైద్య పరిశోధన మండలి , ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల తెలిపాయి. జనవరి 2 నుంచి మార్చి 5 వరకు దేశ వ్యాప్తంగా 451హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. ఈ నెలాఖరుకు కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు అభిప్రాయపడుతున్నారు. హెచ్3ఎన్2 , ఇతర ఇన్‌ఫ్లుయెంజా ఇన్‌ఫెక్షన్లు సీజనల్‌గా వచ్చేవని, ఇవి పెరగకుండా తగిన చర్యలు తీసుకొనేందుకు కేంద్రం దృష్టి సారించింది. ఈ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు స్వీయ మెడికేషన్, యాంటీ బయోటిక్స్ వాడకాన్ని నివారించాలని ఐసిఎంఆర్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News