హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత వారం రోజులుగా ప్రభుత్వం 400 ఎకరాల భూమిని చదును చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం సుప్రీంకోర్టు దానిపై స్టే విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రభుత్వం పనులు ఆపింది. అప్పటి వరకు అడవి ప్రాంతంలోని చెట్లను తొలగిస్తూ భూమిని చదును చేసుకుంటూ వెళ్లిన బుల్డోజర్ల ధాటికి ఇప్పటికే ఒక జింక మృతి చెందగా తాజాగా మరో జింక శుక్రవారం మరో జింక మృతి చెందింది. పచ్చని అడవే తమ అవాసామని భావించిన వన్యప్రాణులు, పక్షులు ఇప్పుడు విలవిలలాడుతున్నాయి. తమ ఉనికిని, అవాసాలను కోల్పోయి జనావాసాల మధ్య తీరుగుతున్నాయి. 400 ఎకరాల భూమిలో చెట్లను తొలగించడంతో ఒక జింక యూనివర్సిటీ మైదానం వైపు వచ్చింది.
దీంతో ఒక్కసారిగా కుక్కలు దాడి చేయడంతో ఆ జింకకు తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన యూనివర్సిటీ విద్యార్థులు, వర్సిటీ సెక్యూరిటీ వెంటనే జింకను చికిత్స నిమిత్తం నల్లగండ్లలోని వెటర్నరీ హస్పిటల్‌కు తరలించారు. అక్కడ డాక్టర్ పరిశీలించి జింక మృతి చెందినట్లు నిర్ధారించారు. అక్కడ నుండి వైద్యులు పోస్టుమార్టం నిమిత్తం జింకను నానాక్‌రామ్‌గూడలోని వెటర్నరీ హస్పిటల్‌కు తరలించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జంతువులు లేవని స్టేట్‌మెంట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు జింకలు చనిపోతుంటే ఏం సమాధానం చెప్తారని ఏబివిపి విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. పచ్చని అడవులను నాశనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పక్షులు, జంతువులు బలి అవుతున్నాయని, దీనిని గమనించి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు.