Monday, January 20, 2025

గుంటూరు, గుంతకల్ మధ్య మరో డబుల్ లైన్

- Advertisement -
- Advertisement -

విద్యుదీకరణ పూర్తి చేసిన దక్షిణ మధ్య రైల్వే

మన తెలంగాణ / హైదరాబాద్ : గుంటూరు- గుంతకల్ డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే మునుమాక సాతులూరు మధ్య 16.6 కిమీల దూరంలో డబుల్ లైన్‌ను ప్రారంభించింది. ఈ సెక్షన్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఉంది. ఈ సెక్షన్ డబ్లింగ్ పూర్తి కావడంతో గుంటూరు జగ్గంబొట్ల , కృష్ణాపురం మధ్య 176 కిలో మీటర్ల మేర విద్యుదీకరణతో పాటు డబుల్ లైన్ సౌకర్యం కూడా ఉంటుంది. గుంటూరు గుంతకల్ సెక్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరాన్ని అలాగే రాయలసీమ ప్రాంతంతో పాటు దక్షిణాది దాటి కలిపే కీలకమైన రైలు లింక్ ఇది కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా ఈ లైన్ గుంటూరు, పల్నాడు, కర్నూలు జిల్లాల మీదుగా పలు లోతట్టు ప్రాంతాలను కలుపుతుంది.

అవాంతరాలు లేని రవాణాను అందించడానికి ఈ విభాగంలో రద్దీని తగ్గించడానికి గుంటూరు గుంతకల్ డబ్లింగ్ విద్యుదీకరణ ప్రాజెక్టు 2016 17 సంవత్సరంలో 401 కిలో మీటర్ల దూరం పనులకు గాను రూ. 3887 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు అయ్యింది. నల్లపాడు సాతులూరు ( 32 కిమీలు), మునుమాక జగ్గంబొట్ల కృష్ణాపురం (122 కిమీ) బేతంచెర్ల మల్కాపురం ( 23 కిమీ), ధోనే గుంతకల్ (68 కిమీ) మధ్య డబ్లింగ్ , విద్యుదీకరణ ఇప్పటికే పూర్తయి ప్రారంభించబడింది. దీంతో మొత్తం 245 కిమీల మేర ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించారు. ఇప్పుడు మనుమాక సాతులూరు మధ్య మరో 16 కిమీ పూర్తి కావడంతో గుంటూరు గుంతకల్ సెక్షన్‌లోని వివిధ విభాగాల్లో విద్యుదీకరణతో కలిపి మొత్తం 261 కిమీల మేర డబ్లింగ్ పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా మునుమాక సాతులూరు మధ్య ఈ సెక్షన్ డబ్లింగ్ పూర్తి కావడంతో గుంటూరు జగ్గంబొట్ల , కృష్ణాపురం, దోనె నుంచి గుంతకల్ వరకు ప్రస్తుతం డబుల్ లైన్‌తో పాటు విద్యుదీకరణను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రాజెక్టులో మిగిలిన సెక్షన్‌లో పనులు వేగంగా జరుగుండడం గమనార్హం. ఈ సెక్షన్‌లో డబ్లింగ్, విద్యుదీకరణ పూర్తి చేయడం వల్ల సెక్షన్‌లో రద్దీ తగ్గడమే కాకుండా రైళ్ల సగటు వేగాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఈ సెక్షన్‌లో కొత్త రైళ్లను ప్రవేశపెట్టడమే కాకుండా దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం నుండి విశాఖపట్నం, కోల్‌కతా, దేశంలోని తూర్పుప్రాంతాలకు వెళ్లే రైళ్లను మరింత సమర్ధవంతంగా నడపడానికి సహాయపడుతుంది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జింఎ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో భాగస్వాములైన కన్‌స్ట్రక్షన్ సంస్థతో పాటు గుంటూరు డివిజన్ రైల్వే అధికారులు, సిబ్బందిని జిఎం అభినందించారు. నిరంతర పర్యవేక్షణతో సెక్షన్‌లో డబ్లింగ్, ట్రిప్లింగ్ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం గుంతకల్ -గుంటూరు ప్రాజెక్టులో ఎక్కవ భాగం పూర్తయిందని ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News