పెట్టుబడుల పేరుతో మోసాలు చేస్తున్న ముఠా సభ్యుల అరెస్టు
హైదరాబాద్: పెట్టుబడులు పెడితే అధిక లాభాలిస్తామంటూ రూ.2.40 కోట్ల రూపాయలు వసూలు చేసిన చైనా కంపెనీపై రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్కి చెందిన శ్రీనివాసరావు, విజయ కృష్ణ, విజయ భాస్కర్ రెడ్డిలను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మోసంపై సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ భారీ మోసం వెనుక చైనాకు చెందిన జూలీ, మైకెల్ హస్తం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వివరాల్లోకి వెళితే..రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ కంటే ముందు హైదరాబాద్ వచ్చిన జూలీ, మైకెల్ మాదాపూర్లో ఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. విజయకృష్ణ, శ్రీనివాస్ రావు, విజయభాస్కర్ రెడ్డితో పాటు మరో 8మంది సహకారంతో నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద 12కంపెనీలను సృష్టించారు.
ఈక్రమంలో 12కంపెనీల పేరుతో 15 బ్యాంకు ఖాతాలను తెరిచి పెట్టుబడులు పెడితే అధిక లాభాలిస్తామంటూ పలువురు అమాయకులను నమ్మించి కోట్లలో వసూలు చేశారు.ఈ నేపథ్యంలో సిసిఎస్ పోలీసులు 2 బ్యాంకు ఖాతాలను పరిశీలించగా వారం రోజుల వ్యవధిలో 2.42కోట్లు జమ అయినట్లు గుర్తించారు. ఆ నగదు మొత్తం కూడా వెంటనే విత్ డ్రా అయినట్లు సిసిఎస్ దర్యాప్తులో తేలింది. వసూలు చేసిన నగదును బ్యాంకు ఖాతాల నుంచి జూలీ, మైకెల్ విత్ డ్రా చేసుకున్నారు. విత్ డ్రా చేసుకున్న నగదులో కొంత కమిషన్ను ముగ్గురు నిందితులకు చెల్లించారు. అధిక లాభాలిస్తామంటూ మొబైల్ అప్లికేషన్ల ద్వారా ఆన్లైన్లో పెట్టుబడులు స్వీకరించిన అనంతరం డబ్బులు వసూలు చేసుకొని మోసానికి పాల్పడ్డారు. ఇలా ఎంత మంది నుంచి ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారనే కోణంలో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసుతో సంబంధం ఉన్న అందరినీ అరెస్ట్ చేస్తే పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉందని సిసిఎస్ పోలీసులు పేర్కొంటున్నారు.