Wednesday, January 22, 2025

వ్యూహాలకు పదును

- Advertisement -
- Advertisement -

ప్రచారానికి మిగిలింది
ఇక ఐదు రోజులే
లక్ష మందితో టిఆర్‌ఎస్
భారీ బహిరంగ సభ
30నచండూరులో
నిర్వహణకు సన్నాహాలు
హాజరుకానున్న సిఎం కెసిఆర్
ప్రచారం ముగిసేదాకా అప్పగించిన
యూనిట్లలోనే ఇన్‌చార్జిలు
ఒక్కో ఓటరును కనీసం
ఆరుసార్లు కలిసేలా ప్రణాళిక
ముఖ్య నేతలంతా మునుగోడులోనే

మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం మరో ఐదు రోజుల్లో ముగియనుండటంతో అధికార టిఆర్‌ఎస్ పార్టీ తన ప్రచార వ్యూహానికి మరింత పదును పెడుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు మునుగోడులో పునరావృతం కా కుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. గెలుపునకు అవకాశం ఉంటే ఏ చిన్న అంశాన్ని కూడా వదలుకునేందుకు ఇష్టపడడం లేదు. ప్రతి ఓటు కారు గుర్తుకే పడే విధంగా అ న్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగం గా నియోజకవర్గాన్ని ఇప్పటికే 86 యూనిట్లుగా విభజించి ప్రతి ఓటరును కలిసేలా ప్రణాళికను పకడ్బందిగా అమలు చేస్తోంది. అగ్రనేతలను సైతం ప్రచారం పర్వంలోకి దించింది. వారిని ప ది రోజులుగా మునుగోడు నియోజకవర్గం ప్రచారానికే పరిమితం చేసింది.అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు, రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరో గ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు ఇతర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండ లి సభ్యులు, కీలక నేతలంతా ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

మరోవైపు క్షేత్ర స్థాయిలోనూ ప్రచారాన్ని సమన్వయం చేస్తున్నారు. ఇ దిలా ఉండగా ఈ నెల 30వ తేదీన చండూరులో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సభలో పాల్గొననున్నారు. మరోవైపు యూనిట్ ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న నేతలంతా చివరి నిమిషం వరకు తమకు కేటాయించిన ప్రాంతంలోనే మకాం వేయాలని ఇప్పటికే కెసిఆర్ ఆదేశించారు. వారి పనితీరుపై ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రైవేటు సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు కెసిఆర్‌తో పాటు కెటిఆర్‌కు నివేదికలు అందజేస్తున్నాయి. ఈ నివేదికల ఆధారంగా అవసరమైన చోట ఇతర ప్రాంతాలకు చెందిన కీలక నేతలను మోహరించి ప్రచార లోపం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే బిజెపి, కాంగ్రెస్ పార్టీల ప్రచార సరళి, అభ్యర్థుల ప్రచారానికి వస్తున్న స్పందన, ఆయా పార్టీలు అనుసరిస్తున్న తెర వెనుక వ్యూహాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. తదనుగుణంగా తక్షణమే ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదంతా కెటిఆర్ పర్యవేక్షణలో కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో ఉంటున్న మునుగోడు ఓటర్లపై దృషి

నియోజకవర్గానికి చెందిన సుమారు 40 వేల మందికి పైగా ఓటర్లు హైదరాబాద్ శివారు కాలనీల్లో ఉంటున్నారు. ప్రతి గ్రామం నుంచి సుమారు 300 నుంచి 500 వరకు ఓటర్లు నగరంలో నివాసముంటున్నట్లు తమ పరిశీలనలో తేలిందని యూనిట్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న టిఆర్‌ఎస్‌కు చెందిన ఒక శాసనసభ్యుడు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా కాలనీల్లోని మునుగోడు ఓటర్ల వివరాలు, ఇంటి చిరునామా, ఫోన్ నంబరుతో సహా ఇప్పటికే సేకరించి పార్టీకి మద్దతు కూడగట్టే ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశామని ఆయన వెల్లడించారు. పోలింగ్ రోజున వారంతా మునుగోడులో ఓటు హక్కు వినియోగించుకునలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ప్రతి ఓటును కీలకంగా భావిస్తున్న టిఆర్‌ఎస్ పోస్టల్ బ్యాలెట్లపైనా దృష్టి సారించి, వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉంది.

ఓటర్లకు నిరంతరం టచ్‌లో ఉంటున్న నేతలు

ఓటర్లను వివిధ కేటగిరీలుగా విభజించి ప్రతి ఓటరును కనీసం అరడజను సార్లు కలిసే వ్యూహాన్ని టిఆర్‌ఎస్ అమలు చేస్తోంది. యూనిట్ ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న నేతలు….. తమ పరిధిలోని ప్రతి వంద మంది ఓటర్లకు ఒక పార్టీ నేత చొప్పున బాధ్యతలు అప్పగించారు. పోలింగ్ రోజున ఓటు వేసి వెళ్లేంతవరకు వారితో టచ్‌లో ఉండేలా ప్రణాళిక అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, సామాజికవర్గాల సమ్మేళనం పేరిట ప్రతి కుటుంబాన్ని చేరుకునేలా టిఆర్‌ఎస్ ప్రచారం సాగుతోంది.

లక్షమందితో బహిరంగ సభ?
ఈ నెల 30 తేదీన తలపెట్టిన భారీ బహిరంగ సభకు కనీసం లక్షమంది హజరయ్యే చూడాలని టిఆర్‌ఎస్ భావిస్తోంది. ఆ సభను చూసి ప్రత్యర్ధి పార్టీలకు ముచ్చెమటలు పట్టాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో జన సమీకరణపై ఇప్పటికే దృష్టి సారించింది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి, ఎంఎల్‌సి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ఈ మేరకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా కెటిఆర్ ఇప్పటికే చౌటుప్పల్, గట్టుప్పల్, మునుగోడు మండల కేంద్రాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ఆయన సభలకు భారీగా జనం హాజరయ్యారు. అదే ఊపు…ఉత్సాహంతో బహిరంగ సభను కూడా సక్సెస్ చేసే విషయంలో కెటిఆర్ సైతం ఎప్పటికప్పుడు తగు సూచనలు, సలహాలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద మునుగోడు ఉపఎన్నిక గులాబీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం మరింతగా తొణికిసలాడుతున్నట్లుగా తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News