Monday, July 8, 2024

బీహార్‌లో కూలిన మరో బ్రిడ్జి… 16 రోజుల్లో 10వ సంఘటన

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్‌లో వంతెనలు కూలిపోయే సంఘటనలు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లోనే సరన్ జిల్లాలో రెండు వంతెనలు కూలగా, తాజాగా జులై 4న అలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. 16 రోజుల్లో ఇది 10 వ సంఘటన. జిల్లాలో ఈ చిన్నపాటి వంతెనలు కూలిపోవడానికి కారణాలేమిటో తెలుసుకోడానికి ఉన్నత స్థాయిదర్యాప్తునకు ఆదేశించడమైందని జిల్లా మెజిస్ట్రేట్ అమన్ సమీర్ వెల్లడించారు. ఇప్పుడు కూలిన వంతెనను 15 ఏళ్ల క్రితం నిర్మించారని, ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. తాజాగా వంతెన కూలడానికి ఇటీవల పూడిక తొలగించడమే కారణంగా తెలుస్తోందని చెప్పారు. బనెయపూర్ బ్లాక్‌లో గండకి నదిపై ఈ వంతెనను నిర్మించారు.

పొరుగున ఉన్న సివాన్ జిల్లాతో సరన్ జిల్లా గ్రామాలకు అనుసంధానంగా ఈ వంతెన ఉంటోంది.బుధవారం సరన్ జిల్లాలో జనతాబజార్ ఏరియాలో ఒకటి, లహ్లాద్‌పూర్ ఏరియాలో ఇంకొకటి మొత్తం రెండు వంతెనలు కుప్పకూలాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేని వానలు కురియడమే ఈ వంతెనలు కూలిపోడానికి దారి తీసిందని స్థానికులు చెబుతున్నారు. మొత్తం మీద గత 16 రోజుల్లో సివాన్, సరన్, మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్‌గంజ్ జిల్లాల్లో 10 వంతెనలు కూలాయి. వంతెనలు కూలడంపై బీహార్ డిప్యూటీ సిఎం సమ్రాట్ చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం ఈ పరిస్థితిపై సమీక్ష చేశారని, రాష్ట్రంలో ఉన్న మొత్తం పాతవంతెనలపై సర్వే నిర్వహించి తక్షణం మరమ్మతులు జరపాల్సిన వంతెనలేవో గుర్తించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారని చెప్పారు.

రోడ్డు నిర్మాణ శాఖ ఇప్పటికే ఈ వంతెన నిర్వహణ విధానాన్ని సిద్ధం చేసిందని, గ్రామీణ పనుల శాఖ తక్షణమే తన ప్రణాళికను రూపొందించాలని ఆయన చెప్పారు. ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ ఈ వంతెనలు కూలడంపై స్పందించారు. జూన్ 18 నుంచి ఇప్పటివరకు బీహార్‌లో 12 వంతెనలు కూలినా, ప్రధాని నరేంద్రమోడీ కానీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గానీ నోరు మెదపక నిశ్శబ్దంగా ఉంటున్నారని విమర్శించారు. మంచి పరిపాలన, అవినీతి రహిత ప్రభుత్వం అన్ననినాదాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి విభాగంలో అవినీతి ఎలా పేరుకుపోయిందో ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News