టీమ్ ఈవెంట్‌లో పసిడి, వుషూలో రోషిబినాకు రజతం
హాంగ్‌జౌ: ఆసియా క్రీడల్లో భారత్ మరో స్వర్ణ పతకం సాధించింది. గురువారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ టీమ్ విభాగంలో భారత షూటర్లు పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నారు. సరబ్‌జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా, శివ నర్వాల్ బృందం ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణం దక్కించుకుంది. ఆరంభం నుంచే అసాధారణ ఆటను కనబరిచిన భారత బృందం 1734 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. చైనా నుంచి గట్టి పోటీ ఎదురైనా చివరి వరకు నిలకడైన ప్రదర్శనను కనబరిచిన భారత బృందం పసిడిని సొంతం చేసుకుంది. కాగా, ఈ ఆసియా క్రీడల్లో షూటింగ్ విభాగంలో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణ పతకం కావడం విశేషం.
రోషిబినా జోరు..
మరోవైపు వుషూలో భారత స్టార్ రోషిబినా దేవి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. వుషూ 60 కిలోల విభాగంలో రోషిబినా ఫైనల్లో ఓటమి పాలైంది. చైనాకు చెందిన వు జియావోయితో జరిగిన తుది పోరులో రోషిబినా 02తో ఓటమి పాలైంది. ఫైనల్లో ఓడడంతో రోషిబినాకు రజతం దక్కింది.