రూ.500 కోట్లతో భారీ విస్తరణకు
హెచ్‌సి రోబోటిక్స్ అంగీకారం
ఈ ఏడాది కొత్తగా 500 మందికి, మూడేళ్ళలో 2వేల మందికి ఉద్యోగాలు
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటి
కంపెనీలు మేం పెట్టుబడులు
తీసుకొస్తుంటే ప్రతిపక్షాల తప్పుడు
ప్రచారం చిన్న, మధ్యతరహా
పరిశ్రమలకు అండగా ఉంటాం
ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించి, తెలంగాణ యు వతకు ఉపాధి కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. డ్రోన్ టెక్నాలజీలో కంపెనీల ఏర్పాటుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో మరో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సెంటిలియాన్ నెట్ వర్క్ కు చెందిన హెచ్ సీ రోబోటిక్స్ ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. ఆ వివరాను శుక్రవారం కంపెనీ ప్రతినిధులతో కలిసి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా సెం టిలియాన్ నెట్ వర్క్ హెచ్‌సీ రోబోటిక్స్ తొమ్మిది దేశాల్లో డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ సాఫ్ట్ వేర్, టెలి కమ్యూనికేషన్, రోబోటిక్స్, విమాన రక్షణకు సం బంధించిన సాఫ్ట్ వేర్ అభివృద్ధితో పాటు పలు రం గాల్లో సేవలు
అందిస్తూ 2వేల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. తాజాగా మరో రూ.500 కోట్లు పెట్టేందుకు ముందుకువచ్చారని, ఫలితంగా ఈ ఏడాది 500 మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయని, ఈ సంఖ్య మూడేళ్లలో 2వేలకు చేరుతుందన్నారు.
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలు : ఇప్పటివరకు ఐటీ రంగంలో పెట్టుబడులన్నీ హైదరాబాద్‌కే పరిమితమయ్యాయని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభగల యువతకు ఉద్యోగాలను కల్పించాలనే సంకల్పంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలని సంకల్పించామన్నారు.
అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని, ఆ దిశగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామన్నారు. సెంటిలియాన్ నెట్ వర్క్ సంస్థ ఇప్పటికే తమ కార్యకలాపాలను కరీంనగర్‌లో ప్రారంభించిందని, మరికొన్ని సంస్థలు కూడా ముందుకువచ్చాయని వివరించారు. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమాలకు అండగా ఉంటామని, వీరికి రావాల్సిన ప్రోత్సాహాకాలు రూ.4,500 కోట్లు 2016 నుంచి పెండింగ్ లో ఉన్నాయని, తాము అధికారంలోకి రాగానే ఈ బకాయిలను చెల్లించేందుకు చొరవ తీసుకున్నామన్నారు. సహేతుక కారణాలు చూపకపోతే గతంలో పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఇతర అవసరాలకు భూములను వినియోగిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పరిశ్రమల పునరుద్ధరణకు గతంలో ఏర్పాటు చేసిన్ హెల్త్ క్లినిక్ పై ప్రత్యేక అధ్యయనం చేస్తున్నామని, దీని వల్ల పరిశ్రమలకు మేలు జరుగుతుందని భావిస్తే అధిక నిధులు కేటాయించి యధావిధిగా కొనసాగిస్తామని చెప్పారు.
పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం : రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఉందని,గత ఏడాది దావోస్ లో చేసుకున్న 18 ఒప్పందాల్లో 17 ప్రాజెక్టులు పట్టాలెక్కాయని, 10 ఒప్పందాల పురోగతి 50 శాతం కంటే ఎక్కువగా ఉందన్నారు. కేవలం ఒప్పందాలు చేసుకుని రావడమే కాకుండా వాటిని కార్యరూపంలోకి తెచ్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ ఏడాది కూడా మేం రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నామని, తాము తాము ఉద్యోగాలను కల్పించేందుకు పాటుపడుతుంటే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ పారిశ్రామికవేత్తలను
భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నడూ భూసేకరణ పనులను అడ్డుకోలేదని, రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచించామన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడుతూ అభివృద్ధికి అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. తమకు రాజకీయాలు కాదని, రాష్ట్రాభివృద్ధే ముఖ్యమన్నారు. పారిశ్రామికాభివృద్ధికి గత ప్రభుత్వం తీసుకున్నా పాలసీలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సెంటిలియాన్ నెట్ వర్క్, ఛైర్మన్ ఎండీ వెంకట్, డైరెక్టర్ రాధా కిషోర్, ఆ సంస్థ ఇండియా ఆపరేషన్స్ హెడ్ సుధాకర్ పాల్గొన్నారు.